Indian Ambassador To United Nations : ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి హరీశ్ పర్వతనేని నియమితులయ్యారు. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను.. న్యూయార్క్‌లోని UNOలో అంబాసిడర్‌గా నియమించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో చెప్పింది.
హరీశ్ పర్వతనేని 1990 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. 2021 నవంబర్ నుంచి జర్మనీలో భారత రాయబారిగా పని చేస్తున్నారు. అంతకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు) గానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో భారత్.. అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకునేలా కృషి చేశారు. వీటితో పాటు జీ20, జీ 7, బ్రిక్స్, IBSA లాంటి కూటముల్లోని ఆర్థిక వ్యవహారాలకు నేతృత్వం వహించారు.
గాజా సహా అనేక మిషన్లలో భాగం
సియారో, రియాద్ సహా భారత్ చేపట్టిన అనేక మిషన్లలో ఆయన పనిచేశారు. ఇజ్రాయెల్‌తో యుద్ధం జరుగుతున్న పాలస్తీనాలోని గాజా సిటీకి భారత ప్రతినిధిగా వెళ్లారు. అక్కడ ఐక్యరాజ్య సమితి మానవతా సాయం కార్యక్రమంలో పాలసీ అనాలిసిస్ యూనిట్ చీఫ్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా, విదేశాంగ ప్రచార విభాగాల్లోనూ పనిచేశారు. 2007 నుంచి ఐదేళ్ల పాటు భారత ఉపరాష్ట్రపతి వద్ద ఓఎస్డీగా ఉన్నారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు అమెరికాలోని హౌస్టన్‌లో 8 రాష్ట్రాలకు సంబంధించిన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు వియత్నాం రాయబారిగా బాధ్యతలు నిర్వహించారు.