TTD Cancelled Arjitha Seva: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్వామివారికి మొక్కులు, ముడుపులు చెల్లించుకుంటారు. మరి మీరు కూడా ఆగస్టు నెలలో స్వామి వారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఈ విషయం తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఈ నెలలో మూడు రోజులపాటు పలు సేవల్ని రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు: ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు తిరుమల ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపమూ రాకుండా.. ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమలలో పవిత్రోత్సవాలు 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15న పవిత్రాల ప్రతిష్ఠ, ఆగస్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆ సేవలు రద్దు: ఈ పవిత్రోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా.. సహస్రదీపాలంకరణ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్ధు చేసింది. అదే విధంగా.. ఆగస్టు 15న తిరుప్పావడతోపాటు ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామి వారి దర్శనానికి రావాలని టీటీడీ సూచించింది.
శ్రీవారి భక్తులకు శుభవార్త - స్వామివారి కానుకల వేలం - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్టు 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా అర్చక బృందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామి మొదటగా కాలు మోపినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.
ఛత్రస్థాపనోత్సవం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుంచి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు. అక్కడి నుంచి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుంచి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్ఠించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ - ఆ టికెట్లను తగ్గించిన టీటీడీ - అప్పటి నుంచే అమలు!
శ్రీవారి భక్తులకు శుభవార్త - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ