Parliament Winter Session 2024 :పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలు అంశాలపై చర్చ జరపాలన్న విషయంపై కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యంగా రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో లోక్‌సభలో, 16, 17వ తేదీల్లో రాజ్యసభలో చర్చించేందుకు తేదీలు ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయసభలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అధికార, విపక్షాల మధ్య ఎట్టకేలకు డీల్- రాజ్యాంగంపై చర్చకు పార్లమెంట్ రెడీ
రాజ్యాంగంపై చర్చించనున్న పార్లమెంట్- అధికార, విపక్షాల మధ్య వీడిన ప్రతిష్టంభన
Published : 5 hours ago
|Updated : 2 hours ago
పార్లమెంట్‌లో అదానీ వ్యవహారం, మణిపుర్ పరిస్థితి, సంభాల్ ఘటన వంటి అంశాలపై చర్చ జరపాలని విపక్షాల డిమాండ్ చేశాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్ల కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్ అంశం, బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, అదానీ సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా ఉభయసభల్లో వరుసగా ఆరో రోజూ ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే అదానీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్, ఫెయింజల్ తుపాన్ కారణంగా తమిళనాడులో ఆస్తి, పంట నష్టంపై చర్చకు డీఎంకే MP టీఆర్ బాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు. ఈ దశలో తాము ప్రస్తావించిన అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా సభ తొలుత 12 గంటలకు తర్వాత బుధవారానికి వాయిదాపడింది. అటు రాజ్యసభలో సంభాల్‌లో హింస, అజ్మల్ షరీఫ్ దర్గా, పంజాబ్‌లో ధాన్యం సేకరణపై చర్చ కోసం పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తోసిపుచ్చారు. మణిపూర్‌పై డీఎంకే ఎంపీ టీ శివ, దిల్లీలో శాంతి భద్రతలు సహా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు సంబంధించి చర్చించాలని వచ్చిన వాయిదా తీర్మానాలను కూడా ఛైర్మన్ తోసిపుచ్చారు. ఈ దశలో చర్చ కోసం పట్టుపడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా తొలుత 12 గంటలకు, తర్వాత రేపటికి సభ వాయిదాపడింది.