Telangana HC Order To review Land Deletion : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో రూ.కోట్ల విలువైన 72 ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేసి పట్టాలు మంజూరు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అటవీ భూమిని డీనోటిఫై చేసే అధికారం కలెక్టర్‌కు ఉందా అని ప్రశ్నించింది. డీనోటిఫై ప్రక్రియను నిబంధనల ప్రకారం చేశారో లేదో వివరాలు సమర్పిచాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్‌ను ఆదేశించింది.
నిషేధిత జాబితా నుంచి తొలగించి, పట్టాలు జారీ చేయాలన్న ఫైలు కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిందా? లేదా అన్న వివరాలను సమర్పించాలని హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో వివాదాస్పద అంశాలున్నాయని, అవి తేలేదాక ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి లేదంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కొంగరకలాన్ గ్రామంలోని సర్వే నం.249లో 10,269.19 ఎకరాల అటవీ భూమిలో 72 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు పట్టదారు పాస్‌పుస్తకాలు జారీ చేయాలంటూ 2019 నవంబరు 16న రంగారెడ్డి జిల్లా కలెక్టరు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కె.ప్రవీణ్‌గౌడ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ కూలీలకూ 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' అందించండి : హైకోర్టు
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ బి.పరోపకారి వాదనలు వినిపిస్తూ 72 ఎకరాల అటవీ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులైన నన్నపనేని నందిత, ఎన్‌డీ ఇన్‌ఫ్రా, దండు కరుణాకర్, ఎస్.రాధాకృష్ణారెడ్డి, సోంపల్లి సాయినాథ్ రెడ్డిలకు పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అటవీ చట్ట నిబంధనల కింద విచారణ జరపకుండానే డీనోటిఫై చేశారని వివరించారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల నిమిత్తం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఫైలు కనిపించడం లేదని సమాధానం వచ్చిందని చెప్పారు.
ఆ అధికారం లేదని కోర్టు అభిప్రాయం : వాదనలు విన్న న్యాయమూర్తి, అటవీ చట్ట నిబంధనల ప్రకారం అటవీ భూమిని డీనోటిఫై చేసే అధికారం కలెక్టర్‌కు లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటీని పరిశీలించాల్సి ఉందని, అందుకు ఎలాంటి విక్రయ లావాదేవీలను అనుమతించరాదని అన్ని పక్షాలకు ఉత్తర్వులు జారీ చేశారు. 72 ఎకరాల భూమి రిజర్వు ఫారెస్ట్‌కు చెందినదా, దీన్ని నిబంధనల ప్రకారం డీనోటిఫై చేశారా, లేదా అన్న దానిపై కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సమాచారం హక్కు చట్టం కింద కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన మెమో వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేశారు.
దొంగతనం బంగారాన్ని పోలీసులు సీజ్ చేయొచ్చా?: స్పష్టత ఇచ్చిన హైకోర్టు