తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1954 కుంభమేళాలోనూ తొక్కిసలాట- దేశంలో 'ఆధ్యాత్మిక' విషాదాలు ఎన్నో! - MAJOR STAMPEDES IN INDIA

1954 నుంచి 2025 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కుంభమేళాల్లో జరిగిన తొక్కిలాసట ఘటనలు

Major Stampede In India
Major Stampede In India (Associated Press, ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 5:14 PM IST

Major Stampede In India :గతంలోనూ వేర్వేరు ప్రాంతాల్లో కుంభమేళాతోపాటు పర్వదినాల సందర్భంగా పలు దుర్ఘటనలు జరిగాయి. వాటిలో వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది భక్తులు హాజరయ్యే వేడుకల ఏర్పాట్ల విషయంలో పాలకులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి. వదంతులు, భక్తుల్లో భయాలు ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

కుంభమేళాల్లో జరిగిన ఘటనలు

  • దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. అప్పుడు ఫిబ్రవరి 3న జరిగిన తొక్కిసలాట దేశచరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా, 2 వేల మంది గాయపడ్డారు. అప్పుడు కూడా మౌనీ అమావాస్య రోజే ఆ దుర్ఘటన జరిగింది. ఓ ఏనుగు అదుపుతప్పి దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
  • 1986 ఏప్రిల్‌ 14న కుంభమేళాలో అప్పటి యూపీ సీఎం వీర్‌బహదూర్‌ సింగ్‌, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలతో కలిసి హరిద్వార్‌లో పుణ్యస్నానానికి వెళ్లారు. భక్తుల రద్దీని నియంత్రించ లేకపోవటం వల్ల తొక్కిసలాట జరిగింది. అప్పుడు 200 మంది మరణించారు.
  • 2003లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. అప్పుడు కూడా తొక్కిసలాట జరిగిన 39 మంది మృతి చెందారు.
  • 2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10న తొక్కిసలాట జరిగింది. ఒక కాలినడక వంతెన కూలిపోవటం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది మరణించారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో

  • కుంభమేళాలే కాకుండా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తొక్కిసలాట ఘటనలు జరిగిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. గతేడాది జులైలో ఉత్తర్‌ప్రదేశ్‌ హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫుల్‌రాయ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బాబా పాదాల వద్ద మట్టి కోసం భక్తులు ఎగబడటం వల్ల తొక్కిసలాట జరిగింది.
  • 2013 అక్టోబర్‌ 13న నవరాత్రుల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రత్నఘడ్‌ మందిరంలో లక్షన్నర మందికిపైగా హాజరయ్యారు. ఓ వంతెన కూలిపోయే స్థితికి చేరిందనే వదంతులతో జనం పరుగులు తీశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రాజస్థాన్‌లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్‌ 30న తొక్కిసలాట జరిగింది. 250 మంది మృతి చెందారు. 420 మందికిపైగా గాయపడ్డారు. బాంబు పేలుడు భయాలే ప్రమాదానికి కారణమనే కథనాలు వెలువడ్డాయి.
  • 2008 ఆగస్టులో హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంలో తోపులాట జరిగి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడుతున్నాయనే వదంతులతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
  • మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి 2005 జనవరిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఆలయ మెట్లపై నుంచి జారి భక్తులు ఒకరిపైకి మరొకరుపడ్డారు. ఈ సందర్భంగా 340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details