Manmohan Singh Biography :భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మృదు స్వభావి అయిన మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యావంతుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త. అయితే వైద్యుడు కావాలనుకొని మెడికల్ కోర్సులో చేరారట. ఆ తర్వాత ఆసక్తి లేక మధ్యలో ఆపేశారు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 వరకూ కొనసాగారు.
అతి సాధారణ కుటుంబంలో!
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్‌లోని గహ్‌లో 1932 సెప్టెంబరు 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడం వల్ల నాన్నమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాకా ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్‌ముఖిలోనూ రాసుకునేవారు.
విభజన తర్వాత హల్ద్వానీకి, ఆ తరువాత అమృత్‌సర్‌కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడి హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతోపాటు 54లో పీజీ చేశారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు.
అధ్యాపకుడిగా!
కేంబ్రిడ్జిలో చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి పీహెచ్‌డీలో చేరారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు. 1957 నుంచి 59 వరకూ పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పని చేశారు. 59 నుంచి 63 వరకూ రీడర్‌గా సేవలందించారు. 63 నుంచి 65 వరకూ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1966 నుంచి 69 వరకూ ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తరువాత విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 1969 నుంచి 71 వరకూ దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు.
1971లో కేంద్ర వాణిజ్యశాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ ఛైర్మన్‌గా బహుముఖమైన సేవలందించారు.
వైద్యుడు కావాలనుకొని!
మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపారు. ఆసక్తికరమైన విషయమేంటంటే తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు ఆయన వైద్యుడు కావాలనుకున్నారట. 1948లో అమృత్‌సర్‌లోని ఖాల్సా కళాశాలలో ప్రీ-మెడికల్ కోర్సులో చేరారు. ఈ విషయాలను మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్‌లీ పర్సనల్; మన్మోహన్ అండ్ గురుశరణ్ పుస్తకంలో రాశారు. "ఆయన తండ్రి వైద్యుడు కావాలని అనుకోవడంతో రెండేళ్ల ఎఫ్‌సీఎస్ కోర్సులో మన్మోహన్ చేరారు. కొన్ని నెలల తర్వాత ఆ కోర్సు మానేశారు. వైద్యుడు కావాలన్న ఆసక్తినీ కోల్పోయారు" అని దమన్ సింగ్ పేర్కొన్నారు.