Fire Accident In UP :ఉత్తర్ప్రదేశ్ కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన రసాయనాలే పేలుడుకు కారణం అయ్యి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు పోలీసులు. ఈ పేలుడు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సంభవించినట్లు ఎస్పీ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. పేలుడు శబ్దం అనేక కిలోమీటర్లు వినిపించినట్లు ఆయన చెప్పారు. అయితే భారీ పేలుడుతో పాటు దట్టమైన పొగ పరిసరా ప్రాంతాల్లో కమ్ముకోవడం వల్ల దగ్గర్లోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రమాద సమయంలో కర్మాగారంలో చాలా మంది పనిచేస్తున్నట్లు ప్రయాగ్‌రాజ్ జోన్ అదనపు డీజీపీ భాను భాస్కర్ తెలిపారు. తీవ్రంగా శ్రమించి అందులోని కొంతమందిని బయటకు తీసుకురాగలిగామని, అప్పటికే అందులో ఏడుగురు చనిపోయారని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారని ఆయన తెలిపారు. మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డట్లు పేర్కొన్నారు. మృతులను ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 35 ఏళ్ల షాహిద్ అలీ, కౌసర్ అలీ, శివనారాయణ్, రామ్‌భవన్, శివకాంత్, అశోక్ కుమార్, జైచంద్రగా గుర్తించారు పోలీసులు.