Farmers Protest Delhi Today Live :కేంద్రానికి డెడ్‌లైన్ విధించిన రైతులు, మరోసారి దిల్లీలోకి ప్రవేశించేందుకు పంజాబ్-హరియాణా సరిహద్దు శంభు ప్రాంతం వద్ద ప్రయత్నించారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. దీంతో అన్నదాతలు పరుగులు పెట్టారు. మరోవైపు, సరిహద్దుల వద్ద రైతులు తీసుకొచ్చిన జేసీబీ యంత్రాలను తక్షణమే అక్కడి నుంచి తరలించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హరియాణాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.
రైతులతో మళ్లీ కేంద్రం చర్చలు!
ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చించిన కేంద్ర ప్రభుత్వం, మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. ఐదో విడత చర్చలకు పిలుపునిచ్చింది.ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. "రైతుల డిమాండ్లపై మరో దఫా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నాను. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం ముఖ్యం" అని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రైతులతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.
'చర్చలకు రండి'
"రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంఎస్‌పీ, పంట మార్పిడి, వ్యర్ధాల దహనంపై మరోసారి చర్చలకు రావాల్సిందిగా రైతులను ఆహ్వానిస్తున్నాం. గత ఆందోళనలో రైతులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఎత్తివేతపై చర్చిస్తాం. శాంతి నెలకొనాలంటే చర్చలు చాలా ముఖ్యం. రైతుల వైపు నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. చర్చలకు వచ్చి వారి వైఖరిని తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా మీడియాతో తెలిపారు.
రైతుల దిల్లీ చలో కార్యక్రమం నేపథ్యంలో దిల్లీ-గురుగ్రామ్, దిల్లీ-బహదూర్‌గఢ్ సహా ఇతర ప్రాంతాల్లో భారీ బలగాలను మోహరించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దిల్లీ, హరియాణాలోని రెండు సరిహద్దు ప్రాంతాలై టిక్రీ, సింఘూను కాంక్రీట్‌తో చేసిన వివిధ అంచెల బారికేడ్లు, ఇనుప మేకులుసహా పోలీసు, పారా మిలిటరీ బలగాలను భారీగా మోహరించటం ద్వారా సరిహద్దులను దాదాపు మూసివేశారు. వివిధ అంచెల బ్యారికేడ్లు, పోలీసుల మోహరింపు ద్వారా ఘాజిపుర్ సరిహద్దులోని 2 లైన్లు మూసివేశారు. అవసరమైతే ఘాజిపుర్ సరిహద్దును పూర్తిగా మూసివేసే ఆలోచనలో ఉన్నారు. మాక్ సెక్యూరిటీ డ్రిల్ కూడా నిర్వహించారు. 30వేల బాష్పవాయు షెల్స్ సిద్ధంగా ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.