Dangerous Threat With Conocarpus Tree : కోనోకార్పస్ చెట్లు చూసేందుకు అందంగా కనువిందు చేసేలా ఉంటాయి. ఆకర్షణీయం వెనుక చాలా అనర్థాలున్నాయి. కోనోకార్పస్ చెట్లను పట్టణాలతో పాటు పల్లెల వరకు ఎక్కువగా నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. మనుషుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో నిరూపితమైంది. కోనోకార్పస్ చెట్లు నాటడం, పెంపకాన్ని రెండు సంవత్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నిషేధం విధించింది. నర్సరీల్లోనూ పెంచ వద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో వాటిని తొలగించేందుకు జిల్లా, పుర, గ్రామ అధికారులకు, పాలకులకు పెను సవాల్‌గా మారింది.
తొలగిస్తేనే - మానవ జీవనానికి మేలు జరగుతుంది : నిర్మల్ జిల్లాలో హరితహారంలో భాగంగా వివిధ దశల్లో ఎక్కువ సంఖ్యలో కోనోకార్పస్ మొక్కలను నాటారు. సుందరీకరణ కోసం పట్టణాల్లోని విభాగినుల మధ్య, పుర, మండల, గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్, రోడ్లకు ఇరువైపులా, ఇలా పలు చోట్లను నాటారు. ప్రస్తుతం కోనోకార్పస్ మొక్కలు ఏపుగా పెరిగాయి. వీటితో అనేక అనర్థాలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు వాటి తొలగింపు సమస్యగా మారింది. వాటి కొమ్మల తొలగింపునకు పుర, గ్రామ కార్మికులు ప్రత్యేకంగా శ్రమ పడుతున్నారు. అయినా కొద్ది రోజుల్లోనే యథాస్థితికి వస్తుండటంతో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. దుష్ప్రభావాలను గుర్తించిన గుజరాత్ రాష్ట్రం మొదట ఈ చెట్టును నిషేధించింది. అనంతరం తెలంగాణలోను అమల్లోకి తీసుకొచ్చారు. ఉపాధి హామీ, ఇతర పథకాల్లో భాగంగా తొలగింపజేసే కార్యక్రమాలు చేపడితేనే పర్యావరణానికి, మానవ జీవనానికి మేలు జరగనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురికానున్నారు : ఉప్పు నీటిలో పెరిగే లక్షణాలు కలిగి ఉండడంతో నీళ్లు లేకున్నా అవి పెరుగుతుంటాయని, వేర్లు బలంగా ఉండడంతో భూగర్భంలోని కేబుల్స్, పైప్‌లైన్లు, విభాగినులు దెబ్బతింటాయని ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు వెల్మల మధు తెలిపారు. పువ్వుల నుంచి సూక్ష్మ రూపంలో విడుదల అయ్యే పుప్పొడితో ఉబ్బసం, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురికానున్నారని అన్నారు. పశువులు వీటి ఆకులను తినలేవని, పక్షులు వాటిపై గూళ్లు ఏర్పర్చుకోలేవని వివరించారు. భూగర్భ జలాలు అడుగంటిపోనున్నాయని, వీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించాలని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో విస్తారంగా పెంచిన ఆ మొక్కలపై నిషేధం..! అవి అంత డేంజరా..?