Delhi Railway Station stampede Eyewitnesses : "అంతా నా కళ్ల ముందే జరిగింది. మృతదేహాలను 14,15 ప్లాట్‌ఫామ్‌ల నుంచి లగేజ్ తీసుకెళ్లే ట్రాలీల్లో అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చాం". దిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటను ప్రత్యక్షంగా చూసిన ఓ రైల్వే కూలి మాటలివి. తమ కళ్ల ముందే జరిగిన తొక్కిసలాటను గుర్తుచేసుకున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు. 18మంది మృతి చెందిన ఈ ఘటనకు తప్పుడు అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది. కొందరు ప్రత్యక్ష సాక్షులు కూడా తొక్కిసలాటకు అదే కారణమని చెప్పారు.
"అనౌన్స్మెంట్ వచ్చిని వెంటనే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు కదిలారు. ఏమి జరిగిందో అని చూసేలోపే కింద పడి చనిపోయారు. నేనెప్పుడూ ఇంత జనసమూహం చూడలేదు" అని రైల్వే స్టేషన్‌లో గత 12 సంవత్సరాలుగా దుకాణం నడుపుతున్న రవి కుమార్ తెలిపారు.
రద్దీగా ఉన్న దిల్లీ రైల్వే స్టేషన్ (AP) "స్టేషన్‌లో విపరీతంగా జనం ఉన్నారు. ఆమె రైలు ప్లాట్‌ఫారమ్ నంబర్ 12 వద్దకు చేరుకోవాల్సి ఉంది. అయితే, అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, ప్రజలు పరుగులు తీశారు. పడిపోయిన వారి కాళ్ల కింద పడి చనిపోయారు" తొక్కిసలాటలో చనిపోయిన ఓ మహిళ అని బంధువు చెప్పారు.
రోధిస్తున్న మృతుల బంధువులు (AP) 'అంతా నా కళ్ల ముందే జరిగింది'
"ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై భారీ జనం గుమిగూడారు. ఆ ప్రదేశమంతా ప్రజలు నిండిపోయారు. ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. దాదాపు 10-15 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందంతా నా కళ్ల ముందే జరిగింది. మృతదేహాలను 14,15 ప్లాట్‌ఫామ్‌ల నుంచి మా(కూలీల) ట్రాలీల్లో అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చాం. అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు" అని రైల్వే కూలీ కృష్ణ కుమార్ జోగి గుర్తుచేసుకున్నారు.
తాము లగేజ్ మోయడానికి ఉపయోగించే ట్రాలీలపై మృతదేహాలను తీసుకెళ్లామని మరో రైల్వే కూలీ బలరాం తెలిపాడు. తాను 15ఏళ్ల నుంచి కూలీగా పనిచేస్తున్నానని కానీ ఇంతమంది జనాన్ని స్టేషన్‌లో ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. "ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిఉన్న ప్రయాణికులు చెప్పులు, వస్తువులు. చాలా మంది వృద్ధులను, చిన్న పిల్లలను తొక్కిసలాట నుంచి బయటకు తీసుకొచ్చాం." అని బలరాం గుర్తుచేసుకున్నాడు.
ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడిఉన్న ప్రయాణికుల వస్తువులు, చెప్పులు (AP) 'తొక్కిసలాటకు కారణం ఇదే'
తొల్కిసలాట జరిగిన సమయంలో 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై పట్నా వైపు వెళ్లే మగద్ ఎక్స్‌ప్రెస్, 15వ ప్లాట్‌ఫామ్‌పై న్యూదిల్లీ-జమ్ము ఉత్తర్ సంపర్క్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయని ఉత్తర రైల్వే సీపీఆర్ఓ హిమాన్షు ఉపాధ్యాయ్ తెలిపారు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా 14, 15 ప్లాట్‌ఫామ్‌ల వైపు ప్రయాణికులు పరుగెత్తారని, ఈ క్రమంలో మెట్లపై జారి ఒకరిపై ఒకరు పడిపోయారని వెల్లడించారు. ఇదే తొక్కసలాటకు దారితీసిందని చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గందరగోళం చెలరేగడానికి ముందు జరిగిన సంఘటనలను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తామని చెప్పారు. తమ బృందాలు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తున్నాయని వెల్లడించారు. మృతుల్లో 9మంది బిహార్‌కు చెందినవారు, 8 మంది దిల్లీకి నుంచి, ఒకరు హరియాణాకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.