Level Playing Field In Campaigning : ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి క్లియరెన్స్ రాకపోవడంపై ఆ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, రాహుల్ గాంధీకి ఇవ్వకపోవడంపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అసలు ఎన్నికల ప్రచారంలో లెవల్ ప్లే ఉండాలని, ఒకరి కంటే మరొకరిని తక్కువ లేదా ఎక్కువ చేసి చూడకూడదని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని లెవల్ ప్లే సరిగ్గా ఉండేలా చూడాలని కోరింది.
"ఎన్నికల ప్రచారంలో అందరికీ సమానావకాశాలు ఉండాలి. ప్రధానమంత్రి ప్రచారానికి అన్నింటి కంటే అధిక ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ రోజు రాహుల్ గాంధీని తక్కువ చేసే ప్రయత్నం జరిగింది. అందుకే ఆయన ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారం ఆలస్యం అయ్యింది."
- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
'ఝార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాహుల్ గాంధీ అన్ని అనుమతులు పొందారు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం, మహాగామా అసెంబ్లీ నియోజవర్గంలో ప్రసంగించిన తరువాత రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1.15 గంటలకు ఇతర ప్రాంతాల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన హెలీకాప్టర్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. సమీపంలో ఇతర నాయకుల (ప్రధాని మోదీ) ప్రోటోకాల్ ఉన్న కారణంగా, నో-ఫ్లై జోన్ పరిమితి విధించారు. దీని వల్ల రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తే, అధికారంలో ఉన్న వాళ్లు ఈ ప్రోటోకాల్‌ను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నాయకుల ఎన్నికల ప్రచారానికి అడ్డంకి ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో ఈసీ కలుగజేసుకుని లెవల్ ప్లే సరిగ్గా ఉండేలా చూడాలి' అని జైరాం రమేశ్ ఎలక్షన్ కమిషన్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మోదీ విమానంలో సాంకేతిక సమస్య
ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి బయల్దేరే సమయంలో ఈ ఘటన జరిగింది. దీనితో ఆయన 2 గంటల తరువాత మరో విమానంలో దిల్లీ వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఝార్ఖండ్‌లోని రెండు ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు.