Dead Man Alive After Ambulance Hits Pothole :రోడ్డుపై గుంతలు ఉంటే వాహనాల్లో ప్రయాణించే వారికి కుదుపుల ధాటికి ఒక్కోసారి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. కానీ ఆ గుంతల్లో మృతహాన్ని తరలించినప్పుడు, ప్రాణాలు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా! మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ 65 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొస్తుండగా రోడ్డుపై ఉన్న ఓ గుంత వల్ల వాహనం ఓ చోట కుదుపునకు గురైంది. దీంతో అతడి శరీరంలో కదలికలు వచ్చి మళ్లీ బతికాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జరిగింది ఇదే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే?
కొల్హాపూర్‌నకు చెందిన పాండురంగ్ డిసెంబర్ 16న ఇంట్లో విఠల్ భగవాన్ నామాన్ని జపిస్తున్నాడు. అకస్మాత్తుగా అతడికి చెమటలు పట్టాయి. అనంతరం గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను కస్బా బావ్డాలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరో ఆస్పత్రికి సిఫారసు చేశారు. అనంతరం కుటుంబీకులు మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాండురంగ్‌ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.