How To Make Egg Pachadi Recipe :చాలా మంది ఇష్టపడే ఫుడ్‌లో కోడిగుడ్డు తప్పకుండా ఉంటుంది. ఇది మంచి పౌష్టికాహారమే కాదు.. సూపర్ టేస్టీ ఆహారం కూడా. దీంతో ఆమ్లెట్ మొదలు.. పులుసు, పొరటు, కూరు, బుర్జీ వంటివి ఎన్నో ప్రిపేర్ చేస్తుంటారు. కానీ.. "కోడిగుడ్డు పచ్చడి" మాత్రం ఎక్కువ మంది ట్రై చేసి ఉండరు. అదుర్స్ అనిపించే ఈ టేస్టీ ఎగ్ చట్నీ.. వారం రోజులపాటు నిల్వ కూడా ఉంటుంది! మరి.. ఈ ఎగ్ పికిల్ తయారీకీ కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- కోడిగుడ్లు - 3
- పసుపు - పావు చెంచా
- కారం - రెండు చెంచాలు
- గరం మసాలా - ఒకటిన్నర చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మరసం - మూడు చెంచాలు
- ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
- అల్లం, వెల్లుల్లి ముక్కలు - కొన్ని
- నూనె - తగినంత
తయారీ విధానం :
- ముందుగా కోడిగుడ్లను(Eggs) ఉడికించుకొని పైపొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
- ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఒక బౌల్లో పావుచెంచా చొప్పున పసుపు, ఉప్పు, అర చెంచా చొప్పున కారం, గరం మసాలా, ఒకటిన్నర చెంచా నిమ్మరసంతో పాటు ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఆ మిశ్రమాన్ని పేస్ట్‌లాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ కట్ చేసుకోవాలి. ఎల్లోను కట్ చేయకూడదు. వైట్ ఎగ్‌ని మాత్రమే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తర్వాత ఎల్లోను కాకుండా.. కట్ చేసుకున్న వైట్ ఎగ్‌ను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమంలో వేసి, ఆ మసాలాను చక్కగా పట్టించి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే ఒకటిన్నర చెంచా కారం వేసుకొని కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం.. స్టౌపై పాన్ పెట్టుకొని మూడు చెంచాల నూనె వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా కోడిగుడ్డు పచ్చసొనను వేయించుకోవాలి. ఆ తర్వాత వైట్ ఎగ్స్ ముక్కలను వేసి.. ఫ్రై చేసుకోవాలి. పూర్తయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో మరో రెండు చెంచాల ఆయిల్ పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- తర్వాత.. ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె పైకి వచ్చేంత వరకూ ఆ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. అలా వేగుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత ఒక చెంచా గరంమసాలా వేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టౌ ఆఫ్ చేయాలి.
- ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చుకొని, ఒకటిన్నర చెంచా నిమ్మరసం యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసుకొని.. ఈ మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకొన్న కోడిగుడ్డు ముక్కలను వేసుకోవాలి.
- ఈ మిశ్రమం ముక్కలుగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కాసేపు వేయించుకొని దింపుకుంటే చాలు.
- నోరూరించే పుల్లపుల్లగా క్రిస్పీగా ఉండే 'కోడిగుడ్డు చట్నీ' రెడీ అయిపోతుంది!
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. కోడిగుడ్డు పచ్చసొన వేయకుండా చేసుకుంటే ఈ పచ్చడి రెండు రోజులపాటు తాజాగా ఉంటుంది. ఇక ఫ్రిజ్‌లో ఉంచితే వారం పదిరోజులపాటు నిల్వ ఉంటుంది!