Disabled Persons In Election Duties : సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. ప్రత్యేకంగా దివ్యాంగులు పనిచేసేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ దివ్యాంగులు ఎవరికన్నా తక్కువకాదని నిరూపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ పేర్కొంది.
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొ దివ్యాంగ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులే అన్ని విధులు నిర్వర్తించనున్నారు. దివ్యాంగులు కూడా ఏ పనినైనా చేయగలరనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు. దివ్యాంగ పోలింగ్ కేంద్రంలో నలుగురు దివ్యాంగ సిబ్బంది, వీరికి మరో ఇద్దరు సహకరిస్తారని పేర్కొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కొక్కటి చొప్పున తొమ్మిది దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
వారికి గుణపాఠంగా ఈ పోలింగ్ కేంద్రాలు
ఎన్నికల విధుల నుంచి సెలవు కోరేవారికి దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు ఓ గుణపాఠమని ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు. 'ఓటింగ్‌కు చాలా రోజుల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరుతున్నారు. అందుకే మేము దివ్యాంగ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నాం. ఈ పోలింగ్ కేంద్రాన్ని చూసి ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవాలనుకునేవారు గుణపాఠం నేర్చుకుంటారు. అంతేకాకుండా పురుషులు, మహిళలు సమానమని చాటిచెప్పేందుకు మహిళా సిబ్బందితో ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేస్తున్నాం' అని ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు.