Manmohan Singh Last Rites : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంత్యక్రియల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45 నిమిషాలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
దిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో మన్మోహన్‌సింగ్ నివాసంలోనే ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
అయితే స్మారక నిర్మాణం చేపట్టేందుకు వీలున్న స్థలంలోనే మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. పార్టీ అధ్యక్షుడు ఈ మేరకు శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం దేశంలో సంప్రదాయంగా వస్తోందని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టే మన్మోహన్ అంత్యక్రియలకు స్థలాన్ని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇదే విషయమై మోదీకి ఖర్గే లేఖ కూడా రాశారు.
పునాదుల కారణంగానే దేశం ఆర్థికంగా!
ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవన్నారు. 2010లో జీ20 సమావేశాల కోసం మన్మోహన్‌సింగ్ కెనడాలోని టొరంటో నగరానికి వెళ్లినప్పుడు భారత ప్రధానమంత్రి మాట్లాడితే ప్రపంచం మెుత్తం వింటుందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యాలను ఖర్గే లేఖలో జతచేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్‌సింగ్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించారని పేర్కొన్నారు. ఆ సమయంలో వారిద్దరూ వేసిన పునాదుల కారణంగానే దేశం ఆర్థికంగా పటిష్ఠంగా ఉందని తెలిపారు. అయితే నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించడంతో కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రభుత్వ స్థలం కేటాయిస్తాం!
అటు ఖర్గే లేఖపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. మన్మోహన్‌సింగ్ స్మారక నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని మన్మోహన్‌సింగ్ కుటుంబ సభ్యులకు, మల్లికార్జునఖర్గేకు తెలియజేశామని వెల్లడించింది. స్మారకం నిర్మించాలని ఖర్గే విజ్ఞప్తి చేయగా, స్థలం కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారని పేర్కొంది. స్మారకం నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. స్థలాన్ని కూడా గుర్తించాల్సి ఉందని తెలిపింది. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని పేర్కొంది.
" today morning, government received a request to allocate space for a memorial for former prime minister late dr manmohan singh, from the congress party president. immediately after the cabinet meeting, hm shri amit shah communicated to congress president shri kharge and the… pic.twitter.com/nySPEMLNw8
— Press Trust of India (@PTI_News) December 27, 2024
పీవీని కాంగ్రెస్ పట్టించుకోలేదు!
మరోవైపు కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ స్మారక నిర్మాణం చేపట్టలేదని విమర్శించింది. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదని మండిపడింది. తమ హయాంలోనే పీవీ నరసింహారావు గౌరవార్థం స్మారకాన్ని నిర్మించి, భారతరత్న ఇచ్చి గౌరవించామని తెలిపింది.