Delhi Assembly Election 2025 BJP : దిల్లీ శాసనసభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సర్కార్ నుంచి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలని కమలదళం వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో 12 ఎస్సీ రిజర్వుడ్ సీట్లు, మెజారిటీ దళిత ఓట్లు ఉన్న 30 నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఈ మేరకు కాషాయ దళం ప్రణాళికలు రచిస్తోంది.
బోణీ కొట్టని బీజేపీ
2015, 2020 దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో బీజేపీ బోణీ కొట్టలేకపోయింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ 2-3 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీంతో ఫిబ్రవరిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో దళిత ఓటర్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తోందని ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.
"దిల్లీలో దళిత ఓటర్ల ప్రాబల్యం 30 నియోజకవర్గాల్లో ఉంది. వాటిలో 12 ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేసినవి. వీటిలో దళిత ఓటర్లు 17- 45 శాతం వరకు ఉన్నారు. అలాగే రాజేంద్ర నగర్, చాందినీ చౌక్, ఆదర్శ్ నగర్, షాహ్దారా, తుగ్లక్‌బాద్, బిజ్వాసన్ సహా మరో 18 నియోజకవర్గాల్లో 25 శాతం వరకు దళిత ఓటర్లు ఉన్నారు. అందుకే గత కొన్ని నెలలుగా దళితుల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ ఎస్సీ మోర్చా అక్కడ తీవ్రంగా పనిచేస్తోంది" అని బీజేపీ నాయకుడు తెలిపారు.
ఆ నియోజకవర్గాలపై బీజేపీ నజర్!
దళిత ఓటర్ల ప్రాబల్యం ఉన్న 30 నియోజకవర్గాల్లో సీనియర్ ఎస్సీ కార్యకర్తలను విస్తారక్‌లుగా నియమించామని దిల్లీ బీజేపీ ఎస్సీ మోర్చా చీఫ్ మోహన్ లాల్ గిహారా తెలిపారు. ఈ నియోజకవర్గాల్లోని దళిత ఓటర్లను వ్యక్తిగతంగా సంప్రదించడానికి విస్తారక్ ప్రతి పోలింగ్ బూత్‌కు 10 మంది దళిత యువకులను నియమించారని పేర్కొన్నారు.