Delhi Man Swallows 39 Coins : ఎవరైనా ఆకలేస్తే అన్నమో, పండ్లో లేదంటే నచ్చిన ఆహారమో తింటారు. కానీ దిల్లీకి చెందిన 26 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం ఏకంగా నాణేలు, అయస్కాంత ముక్కలను తిన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దిల్లీలో నిజంగా జరిగింది ఈ ఘటన. అయితే, శారీరక దారుఢ్యానికి జింక్ అవసరమనే తాను ఇలా చేశానని చెబుతున్నాడు. ఇంతకీ ఎం జరిగిందంటే?
పేషెంట్ పొట్టలో 37 నాణేలు, 39 అయస్కాంతాలు
దిల్లీకి చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తి చాలా రోజులుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ వ్యక్తిని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు అతడి కుటుంబ సభ్యులు. అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, పొట్టలో లోహలు ఉన్నాయని నిర్ధరించారు. దీంతో ల్యాప్రొస్కోపిక్ సర్జన్ తరుణ్ మిట్టల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం రోగికి శస్త్రచికిత్స చేశారు. రోగి పొట్టలో రెండు, ఐదు రూపాయల విలువున్న 39 నాణేలు, వివిధ పరిమాణాల్లో ఉన్న 37 అయస్కాంతాలను గుర్తించారు. అయితే వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించామని సర్జన్ తరుణ్ మిట్టల్ వివరించారు. '26 ఏళ్ల ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అతడి ఎక్స్‌రేను వెంట తీసుకువచ్చారు. దానిని పరిశీలించగా పొట్టలో ప్రేగులకు అడ్డంగా అయస్కాంతాలు, నాణేలు ఉన్నట్లుగా గుర్తించాం. CT- స్కాన్ చేసిన అనంతరం శస్త్రచికిత్స చేసి పేషేంట్ పొట్టలో ఉన్న నాణేలను బయటకు తీసాము. ఏడురోజుల పాటు ఆసుపత్రిలో చికిత్సను అందించి అతడిని డిశ్చార్జ్ చేశాము' అని వైద్యులు తరుణ్ మిట్టల్ తెలిపారు.