Modi On Crimes Against Women :దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్టకూడదని తెలిపారు. మహిళల భద్రతకు దేశం ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన లఖ్పతీ దీదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
"భారత్‌లోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే దేశ తొలి ప్రాధాన్యం. ఎర్రకోట నుంచి ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తాను. దేశంలో ఉన్న మహిళల బాధను అర్థం చేసుకోగలను. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపం. దోషులెవరైనా వదిలిపెట్టొద్దని దేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి చెబుతాను. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి సాయం చేసే వారిని విడిచిపెట్టకూడదు. ఆస్పత్రి, పాఠశాల, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరగకూడదు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి, అయితే మహిళల గౌరవాన్ని కాపాడడం సమాజం, ప్రభుత్వంగానూ మనందరి పెద్ద బాధ్యత."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'మహిళలకు గత ప్రభుత్వాల కంటే చాలా ఎక్కువ చేశాం'
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మహిళలకు గత ప్రభుత్వాలు చేసిన దానికంటే, గత పదేళ్లలో ఎన్డీఏ సర్కార్ నారీమణుల కోసం చాలా చేసిందన్నారు ప్రధాని మోదీ. 2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25,000 కోట్లలోపే రుణాలు ఇచ్చారని, అయితే గత 10 ఏళ్లలో రూ.9 లక్షల కోట్ల సాయం అందించామని వెల్లడించారు. లఖ్పతీ దీదీ పథకం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాక, భవిష్యత్తు తరాలకు సాధికారత చేకూర్చేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో జల్గావ్లో లఖ్పతీ దీదీలతో సంభాషించారు ప్రధాని మోదీ. అలాగే 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 48 లక్షల మంది సభ్యులకు లబ్ధి చేకూర్చే రూ.2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేశారు.
"మహిళలు ఇల్లు, కుటుంబాన్ని ముందుండి నడిపిస్తారు. అయితే మహిళలకు సాయం చేయడానికి గత ప్రభుత్వాలేవీ ముందుకు రాలేదు. మహిళల పేరు మీద ఆస్తులు లేవని, బ్యాంకులో రుణం పొందలేకపోయేవారు. అందుకే నేను మీ కొడుకు, సోదురుడిగా మహిళా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాను. గత పదేళ్లలో కోటి మంది లఖ్పతీ దీదీలను తయారు చేశాం. మహారాష్ట్ర భవిష్యత్, శ్రేయస్సు కోసం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కార్ రాష్ట్రంలో మరిన్ని ఏళ్లు పాలనలో ఉండాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన భారత్‌లో మహారాష్ట్ర ఒక ప్రకాశించే నక్షత్రం. రాష్ట్ర ప్రజలంటే పోలండ్ దేశస్థులకు చాలా గౌరవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్ శరణార్థులకు మరాఠీ ప్రజలు అండగా నిలిచారు. అందుకే పోలాండ్ దేశస్థులు ఇప్పటికీ మహారాష్ట్ర ప్రజలను గౌరవిస్తారు" అని ప్రధాని మోదీ తెలిపారు.
'ఆడవాళ్లపై అకృత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష- వెన్నులో వణుకు పుట్టేలా ప్రచారం చేయండి!'- వారికి మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! -
'వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు- భారత్‌లోనే 2036 ఒలింపిక్స్!'- ప్రధాని మోదీ