తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేను 'కామన్​ మ్యాన్' సీఎం- అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే: ఏక్​నాథ్​ శిందే

మహా ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి ధీమా- తాను కామన్ మ్యాన్ సీఎం అంటున్న ఏక్​నాథ్ శిందే

Maharashtra Polls
Eknath Shinde (ANI)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Maharashtra Polls Eknath Shinde : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజల వద్దకు వెళ్లి వారి మాటలు విన్నానని, అందుకే గెలుస్తామని కచ్చితంగా చెబుతున్నానని అన్నారు. తనను తాను కామన్​ మ్యాన్ సీఎంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను నేరుగా వెళ్లి ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు వింటానని పేర్కొన్నారు. తమది చెవిటి, మూగ ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు.

గర్వించదగ్గ విషయం!
ప్రజల సొమ్మును వారి ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా ఖర్చు చేయాలని తెలిపారు ఏక్​నాథ్ శిందే. అందుకే తాను ఎక్కడ ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్ స్లిప్ వస్తే వెంటనే సంతకం చేసి లక్షల మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు. అది తనకు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ మేరకు ఏఎన్​ఐ వార్తా సంస్థకు శనివారం ఉదయం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏక్​నాథ్ శిందే పలు​ వ్యాఖ్యలు చేశారు.

నేను టీమ్ లీడర్ మాత్రమే!
మహాయుతి కూటమి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలను శిందే తోసిపుచ్చారు. "మా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. రాష్ట్రం అభివృద్ధి చెందేలా మార్పులు తీసుకొచ్చింది. ఉపాధి కల్పించింది. లోక్​సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. నేను ప్రస్తుతానికి టీమ్ లీడర్. మా టీమ్​లో అందరూ సమానమే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మహాయుతి లక్ష్యం" అని తెలిపారు.

ఆ పథకాన్ని ఎవరూ ఆపలేరు!
రాష్ట్ర బడ్జెట్‌కు మించి ఉచిత హామీలు ఇవ్వవద్దని కాంగ్రెస్​కు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సూచించిన విషయంపై ఏక్‌నాథ్ శిందే స్పందించారు. "కాంగ్రెస్​కు ఎలా ఇవ్వాలో తెలియదు. ఎలా తీసుకోవాలో మాత్రమే తెలుసు. మేం ఒక రూపాయి ఇచ్చినా అది నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తుంది. మేం రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నాం. ఏది కూడా ఉల్లంఘించలేదు. లడ్కీ-బెహనా పథకాన్ని ఎవరూ ఆపలేరు" అని స్పష్టం చేశారు.

మహాయుతి కూటమికి ఎన్నికల్లో లడ్కీ-బెహనా పథకం మంచి ఫలితాలను ఇస్తుందని ఏక్​నాథ్​ శిందే విశ్వాసం వ్యక్తం చేశారు. "ఇదంతా ప్రతిపక్షాలకు ఊహించనిది. ఇంత పెద్ద పథకాన్ని అమలు చేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని వారికి తెలియదు. మా ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోంది. గత ప్రభుత్వం తమ ఆస్తులు పెంచుకోవడానికి, సొంత ప్రయోజనాల కోసం పని చేసింది" అని విమర్శించారు.

ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి!
ఎన్నికల కోడ్ కారణంగా లాడ్లీ బెహెన్‌ పథకానికి సంబంధించిన నవంబర్‌ నెల డబ్బులను అక్టోబర్‌లోనే ఇచ్చామని శిందే తెలిపారు. 'నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు ఆ తర్వాత డిసెంబర్‌ డబ్బులు ఇస్తాం. నేను పేద రైతు కుటుంబానికి చెందిన వాడిని. పేదరికాన్ని చూశాను. అందుకే అధికారంలో వచ్చాక నా ప్రియమైన సోదరీమణులు, తల్లులు, రైతులు, సోదరులు, సీనియర్ సిటిజన్ల కోసం కష్టపడుతున్నాను" అని తెలిపారు. దానిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details