Republic Day 2025 Celebrations : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటనుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని తొలిసారి రిపబ్లిక్ పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. ఈసారి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
దిల్లీ కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకల కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జాతీయ యుద్ధ స్మారకం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) తదితరులు నివాళుర్పించనున్నారు. అనంతరం కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు మొదలవుతాయి. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఇండోనేసియా అధ్యక్షుడు సంప్రదాయ గుర్రపుబగ్గీలో కర్తవ్యపథ్ చేరుకుంటారు.
కవాతులో ఇండోనేషియా సైనికులు
తొలుత జాతీయజెండాను ఆవిష్కరిస్తారు. పదిన్నరకు గణతంత్ర దినోత్సవ కవాతు మొదలవుతుంది. అందులో ఇండోనేసియా సైనికులు కూడా పాల్గొంటారు. 190మంది మిలిటరీ బ్యాండ్, 152మంది మార్చ్‌ఫాస్ట్ చేయనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తయిన వేళ స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. 16 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్రప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ఈ పరేడ్‌లో పాల్గొంటాయి.
పరేడ్‌లో డీఆర్డీఓ ప్రళయ్ క్షిపణి
ఈ సందర్భంగా భారత్ తన సైనికశక్తిని ప్రపంచానికి చాటనుంది. బ్రహ్మోస్ క్షిపణి, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్, ఆకాశ్ క్షిపణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి తొలిసారి పరేడ్‌లో దర్శనమివ్వనుంది. నాగ్ మిసైల్ వ్యవస్థ, మల్టీబ్యారల్ రాకెట్ లాంఛ్ సిస్టం అగ్నిబాణ్, తేలికపాటి వాహనం భజ్‌రంగ్‌లను కూడా పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. బలమైన, సురక్షిత భారత్ ఇతివృత్తంతో త్రివిధదళాలు సంయుక్తంగా ఓశకటాన్ని ప్రదర్శించనున్నాయి. రక్షా కవచ్ ఇతివృత్తంతో డీఆర్డీఓ శకటాన్ని ప్రదర్శించనుంది. సీ-130జె సూపర్ హెర్క్యూలస్, సీ-295, సీ-17 గ్లోబ్‌మాస్టర్, మిగ్-29, సుఖోయ్-30 జెట్ ఫైటర్లు విన్యాసాలతో అబ్బురపర్చనున్నాయి.