Delhi Polls Congress Manifesto : దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. తూర్పు ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయాన్ని అందిస్తామని తెలిపింది. ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను ప్రజలకు కల్పిస్తామని పేర్కొంది కాంగ్రెస్. ఉచిత రేషన్ కిట్లను ప్రతినెలా ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపింది. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ప్రతినెలా రూ.8,500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దిల్లీ మహానగరం పరిధిలో 100 ఇందిర క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. వాటి ద్వారా కేవలం రూ.5కే భోజనం అందిస్తామని హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ మేనిఫెస్టో - హామీలు
- దిల్లీలో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేసి, ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్న వారందరి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది.
- వృద్ధుల నెలవారీ ప్రభుత్వ పింఛను రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంపు
- వితంతువుల కుమార్తెల వివాహాలకు రూ.1.1 లక్షల ఆర్థిక సాయం
- దిల్లీలో వీధి వ్యాపారాలు చేసుకునే 7.5 లక్షల మందికి మరింత మెరుగైన అవకాశాల కల్పన
- దిల్లీలోని ప్రతీ వార్డులో 24 గంటలూ అందుబాటులో ఉండేలా వైద్య డిస్పెన్సరీల ఏర్పాటు
- విద్యార్థుల కోసం దిల్లీలో 700 ప్రజా గ్రంథాలయాల ఏర్పాటు