Congress Manifesto Lok Sabha Polls 2024 : సార్వత్రిక ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఓ ప్రణాళికతో ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. అందుకోసం 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో తొలిసారిగా యువతకు 'ఉపాధి హక్కు' హామీని కాంగ్రెస్ ఇవ్వనుందని సమాచారం. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో పేపర్ లీక్‌లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించడం, ప్రభుత్వ నియామకాలలో పారదర్శకతను తీసుకురావడానికి చర్యలను సూచించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ బుధవారం లోక్‌సభ ఎన్నికల ముసాయిదా మ్యానిఫెస్టో ప్రతిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో యువత వివరించిన పరిస్థితుల ఆధారంగా కమిటీ డ్రాఫ్ట్ మ్యానిఫెస్టోను రూపొందించినట్టు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ముసాయిదా మ్యానిఫెస్టో సిద్ధంగా ఉందని అది తనకు, కమిటీ సభ్యులు అందచేశారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే తెలిపారు. మ్యానిఫెస్టోలో కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో పాటు ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడానికి దేశంలో కుల ఆధారిత జనాభా గణనపై కాంగ్రెస్ దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తర్వాత మ్యానిఫెస్టో ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.