Chiranjeevi Padma Vibhushan :అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మవిభూషణ్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి విచ్చేశారు. అందుకోసం బుధవారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు చిరంజీవి.
భారత గణతంత్ర్య దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీని మరణాంతరం ఈ పురస్కారంతో గౌరవించారు. హోర్ముస్జీ ఎన్.కామా గురువారం పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
ఏప్రిల్ 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి, మిగతా వారికి గురువారం సాయంత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.