CBI Arrests Ex Principal Of RG Kar :బంగాల్లోని కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరో పోలీసు అధికారిని కూడా అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా డాక్టర్ అత్యాచారం కేసులో సందీప్ అరెస్ట్ అయ్యారు.
సంబరాలు చేసుకున్న డాక్టర్లు :
సందీప్ ఘోష్ అరెస్ట్‌తో డాక్టర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడారు. "సాక్ష్యాలను తారుమారు చేయడం వల్ల కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి అభిజిత్ మోండల్‌ను అరెస్టు చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ అరెస్ట్ ఆనందాన్ని కలిగిస్తోంది'' అని వైద్యుడు తెలిపారు.