Can Kejriwal Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేశాక కొన్ని కొత్త ప్రశ్నలు ఉదయించాయి. ఆయన ఈనెల 28 వరకు ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కోనున్నారు. ఆ తర్వాత కస్టడీ గడువును పొడిగిస్తారా ? లేదా ? అనేది తర్వాతి విషయం అయితే ఇప్పటికిప్పుడు సమాధానం దొరకాల్సిన అంశం 'దిల్లీ సీఎం సీటు'తో ముడిపడినది. ఈ కేసులో ఇంకా దోషిగా తేలనందున జైలులో నుంచే సీఎంగా కేజ్రీవాల్ దిల్లీని పాలిస్తారని ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి చెబుతున్నారు. ఆమె చెబుతున్న విధంగా సీఎం స్థాయి వ్యక్తి జైలు నుంచి పరిపాలన చేయడం సాధ్యమయ్యే విషయమేనా? అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందా? మంత్రివర్గంతో కనీస సమావేశాలు నిర్వహించకుండా జైలు నుంచి పాలన ఎలా ముందుకు సాగుతుంది? అనే అంశాలపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
సమావేశాలు, సమీక్షలు జైలు నుంచి అసాధ్యం
ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టయిన దేశంలోని తొలి నాయకుడిగా ఆప్ చీఫ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. అయితే ఆ పదవిని జైలులో ఉన్నా వదిలేది లేదు అన్నట్టుగా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు ఆయనకు సీఎం పదవిపై ఉన్న వ్యామోహాన్ని బహిర్గతం చేస్తున్నాయని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అగ్రనేత హేమంత్ సోరెన్‌ను కూడా ఇటీవలే మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. అయితే ఆయన అరెస్టు కాగానే పదవిని వదిలేశారు. ఝార్ఖండ్‌లో పాలనా సౌలభ్యం కోసం తన నమ్మకస్తుడికి సీఎం సీటును అప్పగించారు. దిల్లీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
జైలులోనే సీఎం దర్బార్ అనే కాన్సెప్ట్ సాధ్యమయ్యే విషయం కాదని రాజ్యాంగ నిపుణుడు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి తెలిపారు. ''జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టం. ప్రభుత్వానికి సంబంధించిన చాలా సమావేశాలకు సీఎం నేరుగా అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. వివిధ అంశాల ఫైళ్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రోజువారీ పనితీరును సమీక్షించాల్సిన బాధ్యత కూడా సీఎందే. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే తన పర్యవేక్షణ అధికారాన్ని ఎలా వినియోగించుకుంటారు'' అని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగంలో అలాంటి రూల్స్ లేవు
ఒకవేళ జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతానని మొండిపట్టుదలకు పోతే ఈ వ్యవహారంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ''సాధారణంగానైతే సీఎంలు అరెస్టయితే వెంటనే మరొకరిని సీఎంగా చేస్తారు. ఒకవేళ దిల్లీలో అలా జరగకపోతే రాజ్యాంగ విచ్ఛిన్నత జరుగుతుంది. రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసే అవకాశాలు ఉంటాయి.'' అని నిపుణులు చెబుతున్నారు. అయితే సీఎం స్థాయి వ్యక్తులు ఏవైనా కేసుల్లో అరెస్టయ్యాక రాజీనామా చేయాలా ? వద్దా ? ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి ? అనే దానిపై మన రాజ్యాంగంలో నిబంధనలేవీ లేవు. సీఎంగా ఉన్నవారు అరెస్టయ్యాక రాజీనామా చేయాలనే రూల్ కూడా లేదు. నేరానికి పాల్పడినవారు, ఏదైనా కేసులో దోషిగా తేలినవారు సీఎంలుగా కొనసాగేందుకు అర్హులు కారని రాజ్యాంగం చెబుతోంది. ''ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏదైనా కేసులో దోషిగా తేలే వరకు పదవిలో కొనసాగొచ్చు. కానీ అనుభవపూర్వకంగా జైలు నుంచి పాలించడం అంత సులభం కాదు. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన పత్రాలపై సీఎం అంగీకారం పొందాలంటే ముందుగా కోర్టు నుంచి అనుమతి తీసుకుని జైలుకు వెళ్లి కలవాల్సి ఉంటుంది'' అని రాజ్యాంగ నిపుణుడు ఎస్‌కే శర్మ తెలిపారు.