Cabinet Decision Today :ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 సీజనుకు సంబంధించి గతంతో పోలిస్తే చెరకు గిట్టుబాటు ధరను క్వింటాల్‌కు 25 రూపాయలు పెంచి 340 చేసింది. 2023-24తో పోలిస్తే ఇది 8 శాతం అధికం. సవరించిన ధరలు 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో రూ.885 కోట్లను కేంద్ర హోంశాఖ బడ్జెట్ నుంచీ, రూ.294 కోట్లను నిర్భయ నిధి ద్వారా సమకూరుస్తుంది. ఈ పథకం కింద 112 అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ 2.0ను కొనసాగిస్తారు.
లైవ్‌స్టాక్ మిషన్‌లో మార్పులు
దేశంలో గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్‌లో మార్పులు చేసింది. వాటి సంరక్షణకు ఔత్సాహికులను ప్రోత్సహించడానికి 50% మూలధన సబ్సిడీ ఇవ్వనుంది. వీర్య కేంద్రాలు, పునరుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 10కోట్ల వరకూ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. పశువుల బీమా కార్యక్రమాన్ని సరళీకరించిన ప్రభుత్వం- లబ్దిదారులు చెల్లించాల్సిన ప్రీమియంను 15శాతానికి తగ్గించింది.
స్పేస్‌కు 100 శాతం ఎఫ్‌డీఐ
అంతరిక్ష రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిచ్చింది. విదేశీ పెట్టుబడులు, కంపెనీలను ఆకట్టుకునేందుకు శాటిలైట్ల విడిభాగాల తయారీ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించింది. ఈ నిర్ణయం ప్రకారం శాటిలైట్ రంగాన్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. ప్రతి కేటగిరీలో అనుమతించే పెట్టుబడుల గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తారు. ఈ పరిమితికి మించిన పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి అవసరం. ఇప్పటివరకు శాటిలైట్ల ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్ల విభాగంలో ప్రభుత్వ మార్గాల ద్వారానే 100 శాతం పెట్టుబడులకు ఆస్కారం ఉండేది. ఈ విధానాన్ని సవరించి శాటిలైట్ల డేటా ప్రోడక్ట్‌లు, యూజర్ సెగ్మెంట్ల రంగంలోనూ వంద శాతం పెట్టుబడులకు అనుమతించనున్నారు.