BUDGET 2024 Expectations : సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పైనే అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, సూర్యోదయ యోజన మొదలైన పథకాల గురించి; పన్నులు, చమురు, వంట గ్యాస్ ధరల తగ్గింపు మొదలైన అంశాల గురించి అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి మోదీ సర్కార్ వ్యూహం ఏంటో చూడాలి.
పీఎం కిసాన్ యోజన
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రైతులను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6000 అందిస్తున్నారు. అయితే రైతులకు అందించే ఈ లబ్ధిని 50 శాతం మేర పెంచి, ఏడాదికి రూ.9,000 అందించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సమాచారం. దీనిని మధ్యంతర బడ్జెట్లోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఆయుష్మాన్ భారత్ యోజన
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఇప్పటి వరకు రూ.5 లక్షల బీమా కవరేజీని అందిస్తోంది. అయితే దీనిని రూ.10 లక్షల వరకు పెంచుతూ బడ్జెట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా రూ.10 లక్షల పరిమితి మేరకు వైద్య సేవలు పొందడానికి వీలవుతుంది.
సూర్యోదయ యోజన
ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సూర్యోదయ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని దీని ఉద్దేశం. కర్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రీన్ ఎనర్జీస్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఈ రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం సబ్సిడీలు అందిస్తోంది. 10 కిలోవాట్ కెపాసిటీ ఉన్న సిస్టమ్‌లకు ఈ సూర్యోదయ యోజన ఫేజ్-2 కింద కిలోవాట్‌కు రూ.9 వేలు నుంచి రూ.18 వేలు వరకు సబ్సిడీ అందిస్తోంది. 10 కిలోవాట్ల కంటే ఎక్కువ ఉన్న సిస్టమ్‌లకు రూ.1,17,000 వరకు ఫిక్స్డ్ సబ్సిడీ అందిస్తోంది. అయితే తాజా మధ్యంతర బడ్జెట్లో ఈ సబ్సిడీ అమౌంట్‌ను మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం.