Brij Bhushan Son Gets BJP Ticket :రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడి బరిలోకి దింపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ స్థానం నుంచి కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయ్‌బరేలీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది.
కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో గెలుపొందారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేశారు. అప్పటి నుంచి బ్రిజ్‌భూషణ్ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగిన ఆయన క్రీడారాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే, జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో ఆయనను బీజేపీ హైకమాండ్ పక్కనబెట్టింది.
కేసులున్నా మంచి పాపులారిటీ!
ఉత్తర్‌ప్రదేశ్‌లో అతిపెద్ద నేతల్లో ఒకరిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు పేరు ఉంది. భారీ సంఖ్యలో కేసులు ఉన్నా, ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో మంచి పాపులారిటీ సంపాదించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాల్లో ఆయన హవా కనపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కైసర్‌గంజ్ స్థానంలో బీజేపీ ఆయన కుమారుడికి అవకాశం కల్పించినట్లు సమాచారం.