తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో BJD కోటను బద్దలు కొట్టిన BJP- పట్నాయక్​కు బిగ్ షాక్ - odisha election result 2024 - ODISHA ELECTION RESULT 2024

Odisha Election Result 2024 : ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకుని బీజేపీ రికార్డ్ సృష్టించింది. ఆరు దశాబ్దాలకుపైగా అప్రతిహతంగా ఒడిశాను ఏలిన బిజూ జనతా దళ్‌కు బీజేపీ చెక్​ పెట్టింది.

Odisha Election Result 2024
Odisha Election Result 2024 (ANI, Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 10:40 PM IST

Odisha Election Result 2024 :ఒడిశాలో బిజూ జనతా దళ్‌ కోటను బద్దలుకొట్టింది బీజేపీ. వరుసగా ఆరు సార్లు అధికారం చేపట్టిన బీజేడీకి చెక్​ పెడుతూ కమలం పార్టీ విజయ దుందుభి మోగించింది. దీంతో ఏడోసారి అధికారం చేపట్టి ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించాలనుకున్న ఆయన కలలపై కమలం పార్టీ నీళ్లు చల్లింది. నిజానికి, మొదట కూటమిగా వెళ్లాలనుకున్న ఇరు పార్టీలు సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరక విడివిడిగా పోటీ చేశాయి. ఇన్నాళ్లు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేడీ అదే పార్టీ చేతిలో ఓటమి పాలైంది. 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ 14 చోట్ల, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు లోక్​సభ ఎన్నికల్లోనూ బీజేడీ చతికిలపడింది. 21 స్థానాల్లో బీజేపీ 20 సీట్లలో ఘన విజయం సాధించగా, కాంగ్రెస్​ ఒక స్థానంలో గెలిచింది.

దెబ్బతీసిన నవీన్ వన్​ మ్యాన్ షో
బిజూ జనతా దళ్‌కు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కరే ప్రజాకర్షణ గల, బలమైన నేత. బీజేడీకి 100 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నా పట్నాయక్‌లాంటి నేత ఒక్కరూ లేకపోవడం ఆ పార్టీని వేధిస్తోంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వంపట్ల నవీన్‌ పట్నాయక్‌ సానుకూలంగా ఉండడం కూడా ఆ పార్టీని ఇరుకున పెట్టింది.

రెబల్స్​ బెడద
ఈసారి ఎన్నికల్లో అసమ్మతి నాయకులతో బిజూ జనతా దళ్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో బీజేడీకి అసమ్మతివాదులు, తిరుగుబాటు నేతలు పెద్ద ఎత్తున పోటీ చేశారు. వీరి వల్ల బీజేడీ ఓట్లు చీలి బీజేపీకి బలంగా మారింది. ఎన్నికలకు ముందే బీజేడీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లడం ఆ పార్టీకి నష్టం చేకూర్చింది.

బీజేపీపై బలంగా పోరాడలేకపోవడం
సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజూ జనతాదళ్ ఇప్పటికే 24 ఏళ్లుగా అధికారంలో ఉంది. గత ఐదేళ్లలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని పార్టీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఒడిశాకు మోదీ సర్కార్‌ నుంచి మద్దతు లభిస్తోందని అందుకే కేంద్రానికి మద్దుగా నిలుస్తున్నామని బిజు జనతా దళ్‌ పార్టీ పార్లమెంటు వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటనతో తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రధాన అస్త్రాన్ని నవీన్‌ పట్నాయక్‌ పార్టీ కోల్పోయి నష్టపోయింది.

మోదీ వేవ్​తో పోటీలోకి
ఒడిశాలో బీజేపీ ప్రధాన బలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఒడిశాలో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయ నాయకుడని అనేక పోల్స్‌ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈసారి ఎన్నికల్లోనూ అది బాగా ప్రభావం చూపింది. మోదీ సమర్థ నాయకత్వం, హిందూ అనుకూల నిర్ణయాలు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్ల ఒడిశాలో కాంగ్రెస్‌ను అధిగమించి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు చేరుకున్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాలు కైవసం చేసుకోని అధికార పీఠాన్ని అధిరోహించింది.

పాండియన్​ను ఒప్పుకోని ఒడిశా
నవీన్ పట్నాయక్ వృద్ధాప్యంలో ఉండటం, వారసుడి విషయంలో ఒడిశా ప్రజలు పాండియన్‌ను స్వీకరించకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రతి పనిలోనూ తమిళనాడుకు చెందిన పాండియన్​ను ముందుంచడాన్ని ఒడిశా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. పైగా ఇదే ఆంశాన్ని బీజేపీ సైతం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. సరిగ్గా ఎన్నికల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిమంత బిశ్వ శర్మ లాంటి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణత వెనుక కుట్ర ఉందని, పాలనను ఆయన సమర్థంగా చేయలేకపోతున్నారని బీజేపీ విమర్శలు గుప్పించి లాభపడింది.

ఒడియేతర అధికారుల ఎఫెక్ట్​
ఒడిశాలో పరిపాలన అంతా ఒడిశా యేతర అధికారులే నడిపిస్తున్నారన్న ఆరోపణ నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై ఉంది. దీనిని భారతీయ జనతా పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నాయక్ ఎక్కువగా ఒడియేతర అధికారులపై ఆధారపడటాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘన విజయం సాధించింది.

మహిళల్లో సైతం తిరుగుబాటు
ఒడిశాలో మహిళలు ఆశీర్వదించినంత కాలం తమ పాలనకు తిరుగులేదని ధీమాగా ఉన్న నవీన్ పట్నాయక్‌కు వారు సైతం ఈసారి వ్యతిరేకంగా ఓటేశారు. ఒడిశాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ మహిళలపై నేరాలు పెరిగాయి. వీటిని బలంగా మహిళల్లోకి తీసుకెళ్లి లాభపడింది బీజేపీ.

ప్రజా వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు
24 ఏళ్ల పాలనలో నిరుద్యోగం, వలసలు పెరగడం అధికార బిజు జనతా దళ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అవినీతి, శాంతిభద్రతలు, వరి సేకరణలో అక్రమాలు, చిట్ ఫండ్, మైనింగ్ స్కామ్‌ వంటివి ఒడిశా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాయి. నవీన్‌ పట్నాయక్ 24 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఒడిశా నుంచి యువకుల వలసలను అరికట్టడంలో విఫలమయ్యారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడింది.

బలహీనంగా కాంగ్రెస్​ పార్టీ
మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ 24 సంవత్సరాలుగా ఒడిశాలో అధికారంలో లేదు. 2019 ఎన్నికల వరకు నంబర్ 2 స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ తర్వాత మరింత దిగజారింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్​ బలహీనపడడాన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ బలంగా లాభపడింది. బీజేడీ-బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే బాగుంటుందని కాంగ్రెస్‌ భావించినా అది సాధ్యపడలేదు.
ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు, 147 శాసనసభ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్‌ జరిగింది.

నవీన్​ పట్నాయక్​కు మోదీ గట్టి షాక్​! ఒడిశాలో బీజేపీ దూకుడు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేనా? NDAకు ఆ మార్క్ అందుతుందా?

ABOUT THE AUTHOR

...view details