Thirunallar Shani Temple : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నట్లయితే చేసే పనిలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, రుణబాధలు, అనారోగ్య సమస్యలు వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ దోషాలు పోగొట్టుకోడానికి శనికి చేసే పూజలతో పాటు ఒక్కసారి ఈ శని దేవాలయాన్ని సందర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఇంతకూ ఈ దేవాలయం ఎక్కడుంది? ఆ ఆలయ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరునల్లార్ శని దేవాలయం ఎక్కడుంది?
తిరునల్లార్ శని దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉంది. రెండు నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శని దేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏలినాటి శని బాధలతో ఇబ్బంది పడేవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు.
దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్రం
అతి ప్రాచీన చరిత్ర కలిగిన తిరునల్లార్ శని దేవాలయాన్ని దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్రం అని కూడా అంటారు. సాక్షాత్తు నల మహారాజు దర్శించుకున్న ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని 'నల' పుష్కరిణిలో స్నానం చేస్తే శని బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని తొలుత చోళులు అభివృద్ధి చేయగా తర్వాతి కాలంలో ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఆలయంలోని శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది.
శివపార్వతుల ఆలయం
ఈ క్షేత్రంలో పరమ శివుడు దర్భారణ్యేశ్వరస్వామిగా, పార్వతి దేవి ప్రాణేశ్వరిగా పూజలందుకుంటున్నారు. అయితే ఈ ఆలయంలో ఓ నియమం ఉంది. ముందుగా శని దర్శనం చేసుకున్న తర్వాతే శివపార్వతుల దర్శనం చేయాలి. ఏడాది మొత్తం విశేష పూజలతో, భక్తుల తాకిడితో కళకళలాడే ఈ మహిమాన్వితమైన ఆలయ విశేషాలను చూద్దాం.
ఆలయ స్థల పురాణం
ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఓ గొల్లవానికి ప్రతిరోజూ ఈ ఆలయంలో పాలు పోయమని ఆఙ్ఞాపించాడంట! శివభక్తుడైన ఆ గొల్లవాడు కూడా రాజుగారి ఆజ్ఞ మేరకు దేవాలయంలో పాలు పోస్తుండేవాడు. అయితే కొన్ని రోజులకు ఆలయ అధికారి ఒకరు గొల్లవానితో శివాలయంలో పోసే పాలు తన ఇంట్లో పోయమని ఈ విషయం రాజుకు చెప్పవద్దని హెచ్చరించాడంట!
ఆలయ అధికారి ఇంటికి తరలి పోయిన పాలు
ఆలయ అధికారి చెప్పినట్లుగా ఆనాటి నుంచి గొల్లవాడు శివాలయంలో కాకుండా అధికారి ఇంట్లో పాలు పోయడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని ఆలయ పూజారి రాజుగారి దృష్టికి తీసుకెళ్లాడు. రాజుగారు గొల్లవాని పిలిచి కారణం అడిగాడు. గొల్లవాడు భయపడి ఎంతకూ విషయం చెప్పలేదు. దీనితో రాజు ఆగ్రహించి గొల్లవానికి మరణశిక్ష విధించాడు. దాంతో గొల్లవాడు శివుని వేడుకోగా శివుడు అనుగ్రహించి ఆ భక్తుని కరుణించాడని కథనం. ఈ క్రమంలోనే శివుని ఆలయంలో బలిపీఠం కొంచెం పక్కకు జరిగిందని అంటారు. ఇప్పటికి అది అలాగే ఉంటూ ఆనాటి సంఘటనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
నల పుష్కరిణి మహత్యం
విదర్భ చక్రవర్తి భీముని కుమార్తె దమయంతి అపురూపమైన అందగత్తె! ఆమెను వివాహం చేసుకోవాలని ఎందరో దేవతలు, రాజులు ప్రయత్నించగా దమయంతి మాత్రం నల మహారాజును వివాహం చేసుకుంది. అది గిట్టని దేవతలు ఆ జంటను ఇబ్బందులు పెట్టమని శనిదేవుని వేడుకున్నారంట!
శని ప్రభావంతో నలునికి అష్టకష్టాలు
శని ప్రభావంతో నల మహారాజు అష్టకష్టాలు పడ్డాడు. రాజ్యం పోయింది. సంపదలు, పరివారం, బంధువులు అందరు దూరమయ్యారు. చివరకు భార్య కూడా దూరమైంది. భుజం మీద ఉన్న వస్త్రంతో పావురాన్ని పట్టుకుని ఆకలి బాధ తీర్చుకోవాలనుకున్న నలునికి ఆఖరికి ఆ వస్త్రం కూడా గాలికి ఎగిరి పోయేంత దుర్భర దారిద్య్రాన్ని అనుభవించాడు. ఇదంతా శని ప్రభావం వల్లనే కలిగింది. దేశదేశాలు తిరిగి చివరకు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి కొలనులో స్నానం చేసి శనిదేవుని, పరమశివుని పూజించిన తర్వాత నలునికి శని బాధలు తొలగి, అతని రాజ్యం తిరిగి అతనికి దక్కింది. అందుకే ఈ పుష్కరిణికి 'నల తీర్థం' అని పేరు వచ్చింది.
తొలగిపోయే శనిదోషాలు
ఈ ఆలయంలో శని శక్తులను పరమ శివుడు తొలగించాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా ఎన్నో శని ఆలయాలున్నా, ఈ ఆలయంలో శని ప్రభావం భక్తులపై పడదని అంటారు. ఇక్కడ పరమ శివుడు ప్రధాన దైవం అయినప్పటికినీ ఆలయంలోని 'నల పుష్కరిణి'లో స్నానం చేసి ముందుగా శనిదేవుని దర్శించి, అనంతరం శివ పార్వతులను దర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని విశ్వాసం.
పరమ శివునికి ద్వారపాలకునిగా శని
ఈ ఆలయంలో పరమ శివునికి ద్వార పాలకునిగా శని ఉంటాడు. ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, పూజాది కార్యక్రమాలు పూర్తయ్యాక కాకులకు అన్నం సమర్పించడం వంటివి చేస్తుంటారు.
పూజోత్సవాలు
ఈ ఆలయం నిత్యం భక్త జనసందోహంతో కళకళలాడుతుంటుంది. మహాశివరాత్రి, కార్తికమాసం, సంక్రాతి వంటి రోజుల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు కూడా విశేషంగా జరుగుతాయి. అలాగే శని దేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు.
ఇలా చేరుకోవచ్చు!
తమిళనాడులోని తిరుచినాపల్లి నుంచి ఈ ఆలయానికి చేరుకోడానికి బస్సు సౌకర్యం కలదు. తిరుచినాపల్లికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమానం, రైలు, బస్సు సౌకర్యం ఉంది.
ఓం నమః శివాయ! - ఓం శనైశ్చరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం