Devotees Travelling By Plane To Kumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. లక్షల మంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ ప్రాంతానికి తరలివస్తున్నారు. అయితే 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న భక్తులు హైదరాబాద్ నుంచి విమానాల్లో వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. రైళ్లలో ఎక్కువ సమయం పడుతుండటంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కుంభమేళా ప్రారంభమై 18 రోజులు అవుతున్నా త్రివేణి సంగమంలో అమృత స్నానం చేసేందుకు వెళ్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు చేస్తే 4 రోజుల సమయం పడుతుంది. దీంతో ఎక్కువ మంది ప్రయాణికులు విమానాల్లో వెళ్లేందుకు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.
విమాన టికెట్ల ధరలు : ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు కనిష్ఠంగా రూ.20,552 నుంచి గరిష్ఠంగా రూ.33,556గా టికెట్ ధరలు ఉన్నాయి. ఈ ధరలకు అదనంగా పన్నులు ఉంటాయి. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు భోజనం, అల్పాహారం అందిస్తున్నాయి. సాధారణ రోజుల్లో విమాన టికెట్ రూ.7 వేలు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు రూ.20 వేల వరకు ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన మౌని అమావాస్య సంధర్బంగా శంషాబాద్ విమానశ్రయం నుంచి తొమ్మిది విమాన సర్వీసులు నడిచాయి. దీంట్లోని అన్ని టికెట్లు అమ్ముడుపోయాయంటే అర్థం చేసుకోవాలి. దీంతో ఫిబ్రవరి 16 వరకు విమాన టికెట్ల ధరలు రూ.20వేల పైనే ఉన్నాయి. ఫిబ్రవరి 2న గరిష్ఠంగా టికెట్ ధర రూ.33,556 ఉంది.
బస్సులు, రైళ్లలో రద్దీ : హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలకు చెందిన భక్తులు, పర్యాటకులు రైళ్లు, బస్సులలో వెళ్లారు. మహారాష్ట్రలోని నాగపూర్, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ, జబల్పూర్ దాటగానే ఆయా రాష్ట్రాల భక్తులు, పర్యాటకులు రిజర్వేషన్ బోగీలో తలుపులు తెరిచి ప్రవేశిస్తున్నారు. దీంతో స్లీపర్లతో పాటు ఏసీ బోగీల్లో కూడా మందితో నిండిపోతున్నాయి.
విమానమే నయం : పిల్లా పాపలు, తల్లిదండ్రులతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన వారు ఈ పరిస్థితులను తమ బంధువులు, మిత్రులకు వివరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్న భక్తులు విమానమే నయం, ఒక రోజులో వెళ్లి రావొచ్చన్న భావనతో టికెట్లను తీసుకుంటున్నారు. కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించాలన్న కోరికలున్న వయోధికులను వారి పిల్లలు డైరెక్ట్ ఫ్లైట్లు, కనెక్టింగ్ ఫ్లైట్లలో తీసుకెళుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకూ నేరుగా వెళ్లే విమానాలు 1.55 గంటల సమయం తీసుకుంటుండగా, ఒక స్టాప్, రెండు స్టాప్‌లున్న విమాన సర్వీసులు 5 గంటల నుంచి 14 గంటల సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో విమాన సర్వీసులకు అధికంగా గిరాకీ ఉందని ప్రైవేటు విమాన సంస్థల ప్రతినిధులు తెలిపారు.
తొక్కిసలాటతో యోగి సర్కార్ రెడ్ అలర్ట్! ఐదుగురు స్పెషల్ ఆఫీసర్ల నియామకం- కుంభమేళాలో కీలక మార్పులు!