తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీకి ఓట్ షేర్ ఎఫెక్ట్​- 0.7శాతం తేడాతో 63స్థానాలకు గండి- కాంగ్రెస్​కు డబుల్​ బెనిఫిట్! - Lok Sabha Election Results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024

BJP Vote Share In Lok Sabha Polls 2024 : ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్ల శాతాల్లో స్వల్ప తేడాలు కూడా సీట్ల విషయంలో భారీ తేడాను చూపుతున్నాయి. 2019తో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం 0.7 శాతమే తగ్గినా ఆ పార్టీ 63 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే 1.7 శాతం ఓట్లను పెంచుకున్న కాంగ్రెస్‌ సీట్లు 52 నుంచి 99కి చేరాయి.

BJP Vote Share In Lok Sabha Polls 2024
BJP Vote Share In Lok Sabha Polls 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 6:54 AM IST

BJP Vote Share In Lok Sabha Polls 2024 : ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 36.6 శాతం ఓట్లు సాధించింది. 2019లో నమోదైన 37.3 శాతంతో పోలిస్తే తగ్గింది 0.7 శాతం మాత్రమే. కానీ, సీట్ల పరంగా మాత్రం భారీగా గండి పడింది. ఏకంగా 303 నుంచి 240 స్థానాలకు భారతీయ జనతాపార్టీ పడిపోయింది. మొత్తంగా 63 స్థానాలు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 21.2 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. అంటే 1.7 శాతం ఓట్లు పెరిగాయి. కానీ, సీట్లు మాత్రం దాదాపు రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి.

ఓట్ల శాతం పెరిగినా ఒక్క సీటు కూడా గెలవలేదు
ఎన్నికల్లో ఓట్ల శాతాల్లో తేడాలు స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో పెద్ద వ్యత్యాసానికి దారితీస్తోంది. తాజాగా బీజేపీ, కాంగ్రెస్‌ విషయంలో అదే జరిగింది. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం 2019తో పోలిస్తే 3.2 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగింది. కానీ, పెరిగిన ఆ ఓట్లు ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాయి. పంజాబ్‌లో ఓట్ల శాతం 9.6 శాతం నుంచి 18.6 శాతానికి పెరిగింది. ఏ పార్టీతో పొత్తు లేకపోవటం వల్ల ఉన్న రెండు సీట్లనూ భారతీయ జనతా పార్టీ చేజార్చుకోవాల్సి వచ్చింది. బిహార్‌లో 23.6 శాతం నుంచి 20.5 శాతానికి కుంగడం కమలదళానికి ఐదు సీట్లకు గండికొట్టింది. బంగాల్​లో బీజేపీకు 1.6 శాతం ఓట్లు తగ్గగా, ఆరు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. 2019లో బంగాల్‌లో 18 సీట్లు నెగ్గిన బీజేపీ ఈసారి 12కే పరిమితమైంది. మహారాష్ట్రలోనైతే తగ్గింది 1.4 శాతం ఓట్లే అయినా సీట్ల సంఖ్య మాత్రం 23 నుంచి 9కి పడిపోయింది.

రికార్డు స్థాయిలో సమాజ్​వాదీ పార్టీ
కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. మహారాష్ట్రలో 16.3 శాతం నుంచి 17.1 శాతానికి ఓట్లను పెంచుకొని సీట్ల సంఖ్యను ఏకంగా ఒకటి నుంచి 13కు చేర్చింది. రాజస్థాన్‌లో 3.7 శాతం ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా సున్నా నుంచి ఎనిమిది సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3 శాతం నుంచి 9.5 శాతానికి ఓట్లు పెరగ్గా, సీట్లు ఒకటి నుంచి ఆరుకు ఎగబాకాయి. ఆ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 18 నుంచి 33.5 శాతానికి పెరిగింది. ఆ పార్టీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 37 సీట్లను కైవసం చేసుకుంది.

NDA పక్ష నేతగా మోదీ- కీలక తీర్మానాలకు కూటమి ఆమోదం- ఆ పార్టీలకు ఖర్గే పిలుపు - loksabha election 2024 result

మోదీకి రజనీకాంత్​ శుభాకాంక్షలు- చంద్రబాబు, స్టాలిన్​కు అభినందనలు

ABOUT THE AUTHOR

...view details