BJP Congress Fight Over Katchatheevu : తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని భారత్-శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపమే కచ్చతీవు. పాక్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ దుమారానికి కారణమైంది. ఇక్కడ ఉన్న సెయింట్ ఆంటోనీ చర్చిలో ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో వారం రోజుల పాటు ప్రార్థనలు జరుగుతాయి.
కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించాలన్న 1974లోని ఇందిరాగాంధీ సర్కారు నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరారు. దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. కచ్చతీవు దీవి విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. ఆ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆశ్చర్యకరమైన, దేశానికి కనువిప్పు కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసిందని, ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైందని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా 75 ఏళ్లు కాంగ్రెస్ పనిచేసిందని పేర్కొంటూ ఓ కథనాన్ని ఉటంకించారు. '
ఎన్నికల వేళ వివాదం
అయితే బీజేపీ తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది. భారత జలాల్లో మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల తమిళనాడులోని రామేశ్వరంతో పాటు పరిసర జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు కచ్చతీవు ద్వీపానికి వెళుతుంటారు. ఇందుకోసం వారు అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్ లైన్‌ను దాటి వెళ్లి శ్రీలంక నేవికి చిక్కి కటకటాలపాలవుతుంటారు. అంటే భారత ప్రాదేశిక జలాలను దాటి వెళుతుంటడం వల్ల శ్రీలంక నేవీ తమిళనాడు జాలర్లను పట్టుకొని జైళ్లలో ఉంచుతోంది. దీంతో అక్కడ ఇది రాజకీయ సమస్యగా మారింది.
అన్నామలై RTI దరఖాస్తుతో మొదలు
ఈ కారణంగా అసలు కచ్చతీవు ద్వీపం ఎవరి అధీనంలో ఉందో చెప్పాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు చేశారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాక్ జలసంధిలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేశారని కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవాల్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి కూడా తెలియజేసినట్లు కేంద్రం సమాధానమిచ్చింది. కచ్చతీవు ద్వీపం తమదే అని నిరూపించకోవడంలో శ్రీలంక వైఫల్యం చెందిందని కేవాల్ సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 1925 నుంచి కచ్చతీవుపై శ్రీలంక సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తోందని కేవాల్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కచ్చతీవు దాని పరిసరాల్లోని మత్స్య సంపదపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రామనాడ్ రాజుకు జమిందారీ హక్కులను ఇచ్చింది. 1875 నుంచి 1948 వరకు కచ్చతీవుపై రామనాడ్ రాజులు జమిందారీ హక్కులను కలిగి ఉన్నారు. జమీందారీ హక్కుల రద్దు తరువాత కచ్చదీవును మద్రాసు రాష్ట్రానికి అప్పగించారు.
1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. కచ్చతీవు దీవి దేశానికి ఎంత ముఖ్యమైన భాగమో తమిళనాడు పౌరులకే కాకుండా మిగతా రాష్ట్రాల పౌరులకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు కచ్చతీవు దీవి చారిత్రకంగా కీలకమైన ప్రదేశమన్న అన్నామలై, వేల ఏళ్లుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా తమిళులు దీవి పరిసరాల్లో చేపలు పట్టుకునే వారని చెప్పారు. అటువంటి ప్రాంతాన్ని శ్రీలంకకు ఏ ప్రాతిపదికన అప్పగించారని ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని తాను విదేశాంగ శాఖను కోరినట్లు అన్నామలై పేర్కొన్నారు.
కాంగ్రెస్ దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకం : అమిత్ షా
ఇందిరా గాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ భారతదేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకమని తేలిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. 'కాంగ్రెస్‌కు స్లో క్లాప్స్! వారు ఇష్టపూర్వకంగా కచ్చతీవును వదులుకున్నారు. దాని గురించి పశ్చాత్తాపపడలేదు. కొన్ని సార్లు ఓ కాంగ్రెస్ ఎంపీ దేశ విభజన గురించి మాట్లాడతారు. మరికొన్నిసార్లు వారు భారత సంస్కృతి, సంప్రదాయాలని కించపరుస్తారు. వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మాత్రమే కోరుకుంటారు.' అని ఎక్స్ వేదికగా అమిత్ షా కాంగ్రెస్‌పై మండిపడ్డారు.