Bihar Political Crisis :జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఇండియా కూటమికి దూరంగా జరుగుతూ ఎన్డీఏ వైపు చూస్తున్నారన్న వార్తల నేపథ్యంలో బిహార్‌లో రాజకీయం రక్తి కట్టింది. విపక్ష కూటమి ఏర్పాటులో క్రియాశీలంగా వ్యవహరించిన నీతీశ్- ఇప్పుడు దాన్నుంచి వేరుపడేందుకు యత్నిస్తుండటం చర్చనీయాంశమైంది. నీతీశ్ నిర్ణయంతో బిహార్‌లో మహా కూటమి సర్కారు స్థానంలో మళ్లీ జేడీయూ- బీజేపీ ప్రభుత్వం ( Bihar Government Change ) కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పెద్ద ఎదురుదెబ్బ కానుంది. అయితే, తిరిగి ఎన్డీఏలోకి వెళ్లాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా జేడీయూకు ప్రయోజనకరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో జనవరి 28న (ఆదివారం) ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ కౌశలేంద్ర ప్రియదర్శి అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ఇటీవలి పరిణామాలను గమనిస్తే నీతీశ్ కుమార్ ఇండియా కూటమిలో అసౌకర్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు రద్దు అవుతున్నాయి. ప్రధానమంత్రి కార్యక్రమాలు ఆర్జేడీ, జేడీయూ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు కొనసాగదనేందుకు ఇదే నిదర్శనం. బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది."
-కౌశలేంద్ర ప్రియదర్శి, సీనియర్ జర్నలిస్ట్
పైచేయి నీతీశ్దే
ప్రస్తుత పరిస్థితుల్లో నీతీశ్ కుమార్‌కే మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రియదర్శి తెలిపారు. ఎమ్మెల్యేలను 'పోగు చేసుకొని' అసెంబ్లీలో బలనిరూపణకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నీతీశ్దే పైచేయిలా కనిపిస్తోందని వివరించారు. ఎన్డీఏతో నీతీశ్ కలిస్తే జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం చాలా తక్కువ అని పేర్కొన్నారు. జేడీయూ శాసనసభ్యులు ఆర్జేడీలోకి వెళ్తారని అనుకోవడం లేదని అన్నారు. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఇతర చిన్న పార్టీలు బీజేపీతో కలిస్తే వారి బలం 128కి పెరుగుతుంది. ఆర్జేడీ కూటమిలో 117 మంది మాత్రమే ఉంటారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243 కాగా, మెజారిటీకి 122 మంది అవసరం.
"ఇండియా కూటమిలో అయోమయంపై నీతీశ్ కుమార్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. నీతీశ్ కుమార్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి బదులుగా కన్వీనర్ పదవి అప్పగిస్తారని రెండు నెలలుగా ప్రచారం జరిగింది. చివరకు అది కూడా రాలేదు. దీంతో నీతీశ్‌కు అక్కడ రాజకీయ భవిష్యత్ ఏమీ కనిపించలేదు. నీతీశ్ కుమార్‌కు లోక్‌సభలో సీట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమిలో ఆయన సౌకర్యంగా లేరు."
-కౌశలేంద్ర ప్రియదర్శి, సీనియర్ జర్నలిస్ట్