Best Indoor Plants for Summer:రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఏసీ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మరి ఎండ వేడి నుంచి తట్టుకోవాలంటే ఏం చేయాలి అనే డౌట్ వచ్చిందా? అందుకోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వేసవి వేడిని తగ్గించుకునేందుకు ఇంట్లోనే చిన్న చిన్న మొక్కలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. కొన్నిరకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాతావరణం ఆహ్లాదంగానే కాకుండా చల్లగా కూడా ఉంటుందంటున్నారు.
బేబీ రబ్బర్: ఇంట్లో పెంచుకునే అందమైన మొక్కల్లో బేబీ రబ్బర్ ఒకటి. ఈ మొక్కలు గాలిలో టాక్సిన్లు తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచి వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే ఈ మొక్క చిన్నగా ఉంటుంది. దీనిని ఇంట్లో ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు. దీనికి ప్రతిరోజూ నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. 2010లో టెక్సాస్ A&M యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం.. బేబీ రబ్బరు మొక్కలు కార్బన్డయాక్సైడ్ స్థాయిలను తగ్గించడంలో, ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని కనుగొంది.
ఫైకస్:ఇంట్లో పెంచుకోవడానికి అనువైన మొక్కలలో ఇదీ ఒకటి. దీన్ని ఒక చిన్నపాటి కుండీ లేదా తొట్టెలో పెంచుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోఎథిలీన్ వంటి గాలిలోని కాలుష్యాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాదు, వేడిని తగ్గించడంలో కూడా సాయపడుతుంది.
వేసవిలో జలుబును తగ్గించుకోవడం ఎలా? మీకోసం 5 సింపుల్ టిప్స్! - Summer Cold Remedies
మనీ ప్లాంట్:మనీ ప్లాంట్ గురించి తెలియని వాళ్లు ఉండరు. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచిది అని చాలామంది నమ్ముతారు. ఈ మొక్క ఇంటికి అందాన్ని మాత్రమే కాదు గాలిలో స్వచ్ఛతను కూడా పెంచుతుంది. గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
ఫెర్న్:వేసవిలో ఇంటిని చల్లగా ఉంచగల మొక్క ఇది. నిండా ఆకులతో కనువిందు చేసే ఫెర్న్ గాలిలో తేమను నిలిపే గుణం కలిగి ఉంటుంది. గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అలాగే ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.