Bengaluru Water Crisis : భారతీయ సిలికాన్ వ్యాలీ, ఉద్యాన నగరి బెంగళూరులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీకి, విపక్షాలకూ చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నగరం పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఈసారి తెరపైకి వచ్చిన నీటి సమస్యలు అభ్యర్థులను హడలెత్తిస్తోంది.
తక్కువ పోలింగ్ శాతం
బెంగళూరు పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. రాజకీయ, ఆర్థిక శక్తి క్షేత్రమైన ఈ ఐటీ నగరంలో పాగా వేసేందుకు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు పోరాడుతుంటాయి. ఇక్కడ స్థానికేతరులదే ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందువల్ల ఓటరు నాడిని పట్టుకోవడం కత్తిమీద సామే. స్థానిక రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోని వలస జీవులు ఎన్నికలంటే తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఆ కారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్ నమోదయ్యే తొలి ఐదు జిల్లాల్లో బెంగళూరు నగరం ఉంటోంది.
ఎన్నికలపై ప్రభావం
అయితే, పోలింగ్‌పై ఆసక్తి చూపని ఓటర్లనూ నగరంలో నెలకొన్న నీటి సమస్య కదిలించేలా ఉంది. 40 రోజులుగా నగరంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల తేదీ నాటికి ఇది మరింత విజృంభించవచ్చని తెలుస్తోంది. బెంగళూరు నగరమంతా కావేరి నీటిపైనే ఆధారపడి ఉండటం వల్ల కేఆర్‌ఎస్ జలాశయంలో నీరు లేని కారణంగా వారానికి ఒక్కసారి కూడా నీరు అందని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ట్యాంకరుకు రూ.1,500ల నుంచి రూ.2వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 50ఏళ్లుగా చూడని నీటి సమస్యను బెంగళూరు నగరం ఎదుర్కోంటోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు అపార్ట్‌మెంట్‌లు, మురికివాడల్లో ఓట్ల కోసం స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నారు.
ఒకరిపై ఒకరు విమర్శలు
ఓటింగ్‌పై ప్రభావం చూపే నీటి సమస్యపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వర్షాలు పడలేదని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది. అనధికారింగా లక్ష బోర్లకు అనుమతి, ట్యాంకర్ మాఫియాని అరికట్టలేకపోవటం, కేఆర్‌ఎస్ జలాశయంలో నీరు లేకున్నా తమిళనాడుకు నీటిని విడుదల చేసిన సర్కారే, ఈ సమస్యకు బాధ్యత వహించాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు బెంగళూరు నగరానికి తాగునీటిని సమృద్ధిగా అందించే మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కరవు పరిహారం సకాలంలో చెల్లించని కారణంగానే తాగునీటి సదుపాయాన్ని అందించలేకపోతున్నట్లు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది.