Baba Siddique Lawrence Bishnoi Plan :మహారాష్ట్ర మాజీ మంత్రి, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యోదంతంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో బాబా సిద్ధిఖీ తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కూడా ఉన్నట్లు తేలింది. బాబా సిద్ధిఖీతో పాటు జీషన్ సిద్ధిఖీని కూడా చంపాలని బిష్ణోయ్ గ్యాంగ్ నిర్ణయించింది. ఘటనా స్థలంలో ఇద్దరినీ లేదా ఎవరు వీలైతే వారిని చంపాలని నిందితులకు పురమాయించింది.
జీషన్ సిద్దిఖీ కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసన మండలి ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. బాంద్రాలో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బాబా సిద్ధిఖీ, జీషన్ సిద్ధిఖీ బయటకు రాగానే నిందితులు, తమ వెంట తీసుకెళ్లిన కారాన్ని సిద్ధిఖీకి కాపలాగా ఉన్న కానిస్టేబుల్ కళ్లలో చల్లారు. వారి వెంట పెప్పర్ స్ప్రేలు కూడా తీసుకెళ్లారు. తుపాకీ శబ్ధం రాకుండా దసరా వేడుకల్లో కల్సిపోయేలా టపాసులు కాల్చాలని పథకం వేసినా అక్కడి భద్రతా సిబ్బందిని చూసి ముందు కాల్చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
శివ్‌కుమార్ ఆరు రౌండ్ల కాల్పులు జరిపి జనాల్లో కలిసిపోయి తప్పించుకున్నాడు. సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లు దొరికిపోయారు. పరిగెడుతున్నవారిని చూసి స్థానికులు ఫోన్ల దొంగలుగా భావించారు. 25 లక్షల సుపారీలో ముగ్గురి నిందితులకు 50వేల చొప్పున ముందే అడ్వాన్స్ అందింది. అటు ఈ కేసులో పంజాబ్‌కు చెందిన జీషన్ అక్తర్ అనే నాలుగో వ్యక్తి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య, దొంగతనం కేసుల్లో రెండేళ్లు జైళ్లో ఉన్న అతడు ఇటీవల విడుదలయ్యాడు. సిద్ధిఖీ హత్యకు 15 రోజుల ముందే అతడి కుటుంబం జలంధర్ విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది.
సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడైన ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని తేలింది. హత్య కేసులో నిందితులైన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, యూపీకి చెందిన శివకుమార్ పోలీసు కస్టడీలో ఉన్నారు. ముంబయి కోర్టులో విచారణ సందర్భంగా ధర్మరాజ్ కశ్యప్ మైనర్‌నని తెలిపాడు. నిందితుడి వద్ద జనన ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల అతడు చెప్పేది నిజమా కాదా తెలుసుకోవడానికి బోన్ అసిఫికేషన్ టెస్టు చేయాలని న్యాయస్థానం పోలీసులకు సూచించింది. ఆ టెస్టులో అతడు మైనర్ కాదని తేలింది. మాజీ మంత్రి హత్య నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ నిందితులకు ఉరిశిక్ష విధించేలా న్యాయనిపుణులతో కలిసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్పష్టం చేశారు.
పక్కా ప్రణాళికతో బాబా సిద్ధిఖీ హత్య - వ్యాపార విభేదాలే కారణామా?