Mini Medaram Jatara 2025 : మేడారంలో సమ్మక్క-సారలమ్మల చిన్నజాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఘనంగా జరగనుంది. గద్దెలను శుద్ధి చేసి గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ఆలయ పూజారులు తొలిరోజు దిష్టి తోరణాలు కట్టడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. పెద్ద జాతరకు రాని వాళ్లు తమ మెక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. కాగా భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం చిన్నజాతర : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నేటి నుంచి చిన్నజాతర ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనంగా ఆదివాసీ ఆచారాలతో నిర్వహించే మేడారం మహాజాతర రెండేళ్లకోసారి అతి వైభవంగా జరుగుతుంది. మహా జాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది. చిన్నా పెద్దా జాతరెల్లిపోదాం అంటూ మేడారం బాట పట్టడం ఈ జాతర ప్రత్యేకత. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు.
జాతరకు ముందు నుంచే భక్తులు వేలాదిగా వచ్చి తల్లులను దర్శించుకుని బంగారం, పసుపు-కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. జంపన్నవాగులో స్నానమాచరించి నేరుగా గద్దెల దగ్గరకు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పిల్లా పాపలతో చల్లగా చూడాలంటూ తల్లులను వేడుకుంటారు.
నాలుగు రోజుల పాటు జరిగే పండుగ : మాఘ శుద్ధ పౌర్ణమి అయిన నేటి నుంచి నాలుగు రోజుల పాటు మండమెలిగే పండుగగా వ్యవహరిస్తూ పూజారులు ఈ చిన్నజాతరను ఆద్యంతం ఘనంగా నిర్వహిస్తారు. మేడారం గద్దెల చెంత కన్నెపల్లి ఆలయంలోనూ శుద్ధి నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం, గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టితోరణాలు కట్టడం చేస్తారు. పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేస్తారు. పెద్ద జాతరకు రాని వాళ్లు తమ మెక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు చెబుతున్నారు.
20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా : చిన్న జాతరకు 20లక్షల మంది వస్తారనే అంచనాతో రూ.5.30 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌లో జరిగే జాతరకూ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. దాదాపు వేయి మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిన్నజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ 200 దాకా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. భక్తుల రద్దీని బట్టి 24 గంటలూ బస్సులు నడపుతామని అధికారులు చెబుతున్నారు.
మేడారం జాతరకు వేళాయే - తేదీలను ఖరారు చేసిన పూజారులు
విద్యుత్ దీప కాంతుల్లో మేడారం - కనువిందుగా డ్రోన్ దృశ్యాలు