Israel On Gaza Ceasefire : హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గట్టి హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ బందీలను ఈ శనివారం మధ్యాహ్నం లోపు విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అలా చేయకపోతే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలుకుతామని స్పష్టంచేశారు.
ఫిబ్రవరి 15న మరింత మంది బందీలను విడుదల చేయడానికి హమాస్ షెడ్యూల్ చేసుకుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఫలితంగా తాము కూడా బందీల విడుదలను ఆపేస్తామని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం పాలస్తీనా పౌరులను గాజాలోకి రాకుండా ఇజ్రాయెల్ ఆలస్యం చేస్తోందని, మానవతా సాయాన్ని అడ్డుకుంటోందని హమాస్ చెబుతోంది. హమాస్ ప్రకటనపై స్పందించిన నెతన్యాహు కాల్పుల విరమణను రద్దు చేస్తామని హెచ్చరించారు. బందీల విడుదలను ఆపితే హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేవరకు తమ బలగాలు పోరాడతాయని తెలిపారు. గాజా లోపల, వెలుపల బలగాలను సమీకరించాలని ఐడీఎఫ్‌ను ఆదేశించినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.
రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వల్ల హమాస్ తన చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తుండగా, ప్రతిగా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఇప్పటివరకు హమాస్ తన తాజా ఒప్పందంలో భాగంగా మొత్తం 21 మంది ఇజ్రాయెల్ వాసులను విడుదల చేసింది. అయితే, బందీల విడుదల ఆలస్యంపై అమెరికా అధ్యక్షుడు హమాస్‌కు డెడ్‌లైన్ విధించారు. శనివారం మధ్యాహ్నం నాటికి మిగిలిన బందీలందరినీ విడుదల చేయాలని అన్నారు. లేకపోతే నరకం చూపిస్తానంటూ హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో గర్భిణిని ఇజ్రాయెల్ సైన్యం హత్య చేసిన ఘటనపై విమర్శలు రావడం వల్ల ఇజ్రాయెల్ ప్రభుత్వం నేరవిచారణకు ఆదేశించింది. లో పాలస్తీనా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే జరిగిన కాల్పుల్లో ఓ 8 నెలల గర్భిణి చనిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.