Bengaluru Techie Suicide Case :భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ చిన్నారి జాడను గుర్తించి, తమకు అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ మనవడి గురించి నిఖితా సింఘానియా లేదా ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వెల్లడించలేదని తెలిపారు.
పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఫరిదాబాద్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో తన కుమారుడు చదువుతున్నాడని, తన సమీప బంధువు సుశీల్ సింఘానియా కస్టడీలో ఉన్నాడని అతుల్ భార్య పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే పిల్లాడి జాడ గురించి తనకు తెలియదని సుశీల్ చెప్పడం గమనార్హం.