Atishi Vs BJP :ఓ వైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, మరోవైపు దిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. దిల్లీ మంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. 'బీజేపీలో చేరాలనే ఆఫర్ నాకు కొందరి ద్వారా వచ్చింది. ఒకవేళ చేరకుంటే నెల రోజుల్లోగా నాతో పాటు దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లను ఈడీతో అరెస్టు చేయిస్తామనే వార్నింగ్ కూడా బీజేపీ నుంచి అందింది' అని ఆతిశీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయింది. ఈ విషయంపై దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ ఆధారాలు చూపాలని ఆతిశీకి పరువు నష్టం నోటీసులు పంపించారు.
ఆతిశీ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ అన్నారు. 'ఆతిశీకి బీజేపీ ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదు. ఆతిశీ అబద్ధాలు చెప్పి పారిపోతానంటే కుదరదు. ఆమెకు ఇప్పటికే పరువు నష్టం దావా నోటీసులు ఇచ్చాం. వాటికి 15 రోజుల్లోగా ఆతిశీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఒకవేళ నోటీసులకు ఆతిశీ సకాలంలో సమాధానం చెప్పకుంటే బీజేపీ తరఫున సివిల్ పరువు నష్టం దావా, క్రిమినల్ పరువు నష్టం దావా చర్యలను తీసుకుంటాం. బీజేపీ ఎలా ఆఫర్ ఇచ్చిందనే దానిపై తగిన ఆధారాలను చూపించాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంది' అని వీరేంద్ర తెలిపారు.
'దేవుడు కూడా బీజేపీని క్షమించడు'
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై దిల్లీ మంత్రి ఆతిశీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదిక ఒక పోస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే యావత్ దేశం, దేవుడు కూడా బీజేపీని క్షమించడని ఆమె పేర్కొన్నారు. ''అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్రమైన డయాబెటిక్ ఉంది. ఆరోగ్య సమస్యలున్నా ఆయన రోజూ 24 గంటలు దేశ సేవ చేసేవారు. అరెస్టు చేసినప్పటి నుంచి కేజ్రీవాల్ బరువు నాలుగున్నర కిలోలు తగ్గింది. కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోంది'' అని ఆమె ఆరోపించారు. కాగా, మంగళవారం ఉదయం కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్ కొంతమేర తగ్గింది. ఆయన షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురవుతున్న విషయం వాస్తవమేనని, ఆయనను తీహార్ జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని జైలు అధికారులు వెల్లడించారు.