Atishi assumes charge as Delhi CM :దిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆతిశీ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆతిశీ, రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్లే కేజ్రీవాల్ తిరిగి వచ్చే వరకు తాను ఈ 4 నెలల పాటు దిల్లీ సీఎంగా పని చేస్తానని అన్నారు. కేజ్రీవాల్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదని ఆతిశీ విమర్శించారు.
'ఖాళీ కుర్చీ కేజ్రీవాల్ కోసం వెయిట్ చేస్తుంది'
"నేను దిల్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. అయితే నాకు ప్రస్తుతం రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితే ఎదురైంది. రాముడి వనవాస సమయంలో భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఎలాంటి బాధ కలిగిందో, ఇప్పుడు నాకు అలాగే బాధగా ఉంది. రాముడి 14ఏళ్ల వనవాసం సమయంలో సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. వచ్చే నాలుగు నెలలు నేను కూడా అలాగే పరిపాలిస్తాను. అరవింద్ కేజ్రీవాల్ గౌరవం, నైతికతకు ఉదాహరణగా నిలిచారు. గత రెండేళ్లుగా బీజేపీ ఆయన ఇమేజ్‌ను దిగజార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆయనపై తప్పుడు కేసులు బనాయించి, ఆరు నెలలు జైల్లో ఉంచింది. దీంతో ప్రజల్లో తిరిగి విశ్వసనీయత పొందేవరకు సీఎం సీటులో కూర్చోనన్నారు కేజ్రీవాల్. అందుకే రాజీనామా చేశారు. దిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్‌దే. దిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తున్నా. అప్పటివరకు ఈ ఖాళీ కుర్చీ ఈ ఆఫీస్‌లోనే ఉంటుంది. కేజ్రీవాల్ కోసం ఎదురుచూస్తుంది" అని ఆతిశీ అన్నారు.
'రాజ్యాంగాన్ని అగౌరపరిచారు'
అయితే ఆతిశీ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆమె ఖాళీ కుర్చీని చూపించడం అనేక ప్రశ్నలకు దారితీస్తుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. దాని అర్థం, ఆమె తనను తాను సీఎం పరిగణించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎంగా ఉండి, మరో వ్యక్తిని ముఖ్యమంత్రి అనుకోవడం, ఆ స్థానాన్ని, రాజ్యాంగాన్ని అగౌరపరచడం అని అన్నారు. "నేను దిల్లీ సీఎంకు ఓ లేఖ రాశాను. అయితే ఆ లేఖను ఎవరు చదువుతారు? ఒక సీఎం, తాను కీలుబొమ్మ అని ఎలా చెప్పుకోగలరు? వారు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు" అని మనోజ్ తివారీ మండిపడ్డారు.