Assam Floods 2024 :ఈశాన్య రాష్ట్రం అసోంను గతనెల రోజులుగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటం వల్ల అసోంను భారీ వరదలు చుట్టుముట్టాయి. అసోంలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. 30 జిల్లాల్లో దాదాపు 24 లక్షల 50 వేల మందికి పైగా ప్రజలపై వరద ప్రభావం పడింది. వరదల కారణంగా తాజాగా దిస్పూర్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా అసోంలో మరణించిన వారి సంఖ్య 64కు పెరిగింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 3,512 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 63,490 హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయనిఅసోం విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
అసోంలోని ధుబ్రి జిల్లాపై వరద తీవ్ర ప్రభావం చూపాయి. ఆ జిల్లాలో 7 లక్షల 75 వేల మంది ప్రజలు వరద ముంపునకు గురయ్యారు. దర్రాంగ్ జిల్లాలో లక్షా 86 వేల మంది, క్యాచర్ జిల్లాలో లక్షా 75 మంది, మోరిగావ్‌లో లక్ష 46, బార్పేట జిల్లాలో, లక్షా 40 వేల మందిపై వరద ప్రభావం పడింది. బిశ్వనాథ్, దిబ్రూగఢ్, గోలాఘాట్, జొర్హాట్, కర్బి, శివసాగర్, తముల్‌పుర్, లఖింపుర్, సోనిత్‌పుర్, తదితర ప్రాంతాలలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు అసోంవ్యాప్తంగా 225 రోడ్లు ధ్వంసమవగా, 10 వంతెనలు కూలాయి. కొన్ని జిల్లాల్లో విద్యుత్ సరాఫరాకు అంతరాయం కలిగి ప్రజలు అంధకారంలో బతుకుతున్నారు.