Arvind Kejriwal Tihar Jail :దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆయన్ను విడుదల చేశారు. కేజ్రీవాల్ బెయిల్ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు జైలు ముందు ఆయనకు వెల్కమ్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వర్షం పడుతుండగా కారులో జైలు బయటకు వచ్చిన కేజ్రీవాల్‌కు, అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీశ్ సిసోదియా తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, తాను రిలీజ్ కావాలని కోరుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జైళ్లు తనను బలహీన పరచలేవని, తనను జైల్లో వేయడం వల్ల, తన కరేజ్ 100 రెట్లు పెరిగిందని అన్నారు. అనంతరం అధికార పక్షంపై మండిపడ్డారు.
"ఇంత వర్షంలోనూ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితం దేశానికే అంకితం. జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు. నేను జైలు నుంచి బయటకు వచ్చాక నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. భగవంతుడు చూపిన మార్గంలోనే నడుస్తూ, దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించే శక్తులపై పోరాటం కొనసాగిస్తాను" అని వ్యాఖ్యానించారు.