తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం- వరుసగా మూడోసారి బాధ్యతలు - Arunachal Pradesh CM Oath Ceremony - ARUNACHAL PRADESH CM OATH CEREMONY

Arunachal Pradesh CM Oath Ceremony : అరుణాచల్ ప్రదేశ్​లో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి కమలం పార్టీ నేత పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Arunachal Pradesh CM Oath Ceremony
Arunachal Pradesh CM Oath Ceremony (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 11:16 AM IST

Arunachal Pradesh CM Oath Ceremony: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్​లో బీజేపీ సర్కార్ మరోసారి ఏర్పాటైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్​ గురువారం ఖండూ చేత ప్రమాణం చేయించారు. రాజధాని ఈటానగర్​లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్ జరిగిన ఆ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.

ఎవరీ పెమా ఖండూ
అరుణాచల్ ప్రదేశ్ దివంగత మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడే పెమా ఖండూ. ఈయన 2000 సంవత్సరంలో హస్తం పార్టీలో చేరారు. కానీ రాజకీయాల్లో చేరిన తొలినాళ్లలో అంతగా క్రియాకీలకం పెమా ఖండూ లేరు. 2011లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో దోర్జీ ఖండూ మరణం తర్వాత పెమా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. తండ్రి నియోజకవర్గమైన ముక్తోలో జరిగిన ఉపఎన్నికల్లో పెమా ఖండూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లో పెమా తనదైన ముద్ర వేశారు.

వరుసగా మూడోసారి
నబమ్‌ తుకి కేబినెట్​లో(కాంగ్రెస్‌)లో పెమా ఖండూ మంత్రిగా ఉన్నారు. 2016లో అరుణాచల్‌లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం వల్ల రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేశాక బీజేపీ మద్దతుతో ఏర్పాటైన కలిఖో పుల్‌ సర్కారులో పెమా మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. కానీ తుకి రాజీనామాతో 2016 జులైలో పెమా ఖండూ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటకీయ పరిస్థితుల్లో పీపీఏలో చేరిన ఆయన అంతర్గత అసమ్మతి కారణంగా పార్టీలో సస్పెండ్ అయ్యారు. తర్వాత పలువురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరి సీఎం సీటును కాపాడుకున్నారు. 2019లో మళ్లీ ముక్తో నుంచి గెలిచి, సులభంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి ముచ్చటగా మూడోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు.

క్రీడలు, సంగీతంపై మక్కువ
పెమా ఖండూకు క్రీడలు, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పలు సమావేశాల్లో కిశోర్‌ కుమార్, మహమ్మద్‌ రఫీ పాటలు పాడారు. క్రికెట్‌ టోర్నమెంట్లు కూడా నిర్వహించేవారు. స్థానిక అథ్లెట్లకు అండగా నిలిచేవారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో గెలుపొందింది. నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు

ABOUT THE AUTHOR

...view details