Operation Sarp Vinash 2024: ముష్కరుల ఆగడాలను అరికట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. ముఖ్యంగా 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0ను ప్రారంభించింది. గత 21 ఏళ్లలో భారత్ ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదే. ప్రధాని కార్యాలయమే ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఇందులో భాగస్వాముల అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
గత రెండేళ్లలో జమ్ముకశ్మీర్‌లో వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది జవాన్లు అమరులయ్యారు. ఆయా ఉగ్రదాడులు, వాటి వెనక ఉన్న కీలక ఉగ్రవాదుల జాబితాను ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సిద్ధం చేసింది. సైనికుల త్యాగాలు వృథా కాకూడదన్న ఉద్దేశంతోనే ఇండియన్ ఆర్మీ ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోంది. మరోవైపు ఉగ్రదాడులతో భయకంపితులవుతున్న సాధారణ ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఆర్మీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారాకమాండోలతో కలిసి 3000 మందితో అదనపు బలగాలను మోహరించింది.