తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ పరిస్థితులపై అమిత్​ షా కీలక భేటీ - అమర్​నాథ్ యాత్ర ఏర్పాట్లపై ఆరా - Jammu Kashmir security - JAMMU KASHMIR SECURITY

Amit shah on Jammu Kashmir security : జూన్​ 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్న వేళ జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న వరుస ఉగ్రదాడి ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఆ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేసింది. ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, అమర్‌నాథ్‌ యాత్రపై సమీక్ష నిర్వహించారు.

Amit shah on Jammu Kashmir security
Amit shah on Jammu Kashmir security (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 2:09 PM IST

Amit shah on Jammu Kashmir security: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర కూడా ప్రారంభంకానున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం సమీక్షించారు. అమర్‌నాథ్‌ యాత్రకు జరుగుతున్న ఏర్పాట్లపై కూడా అమిత్‌షా ఆరా తీశారు.

ఇక ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, రానున్న రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ఉద్ధృతిపై అధికారులు అమిత్‌ షాకు వివరించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ కూడా జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేతకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు.

యాత్రికులకు బీమా సదుపాయం
ముఖ్యంగా అమర్‌నాథ్‌ యాత్రకు ముందు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 29న మొదలుకానున్న అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 19వ తేదీ వరకు జరగనుంది. గత ఏడాది 4 లక్షల 28 వేల మంది అమర్‌నాథ్‌ యాత్రకు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. యాత్రికులు రియల్‌ టైమ్‌ లొకేషన్‌ను తెలుసుకునేందుకు అందరికీ RFID కార్డులను అందజేయనున్నారు. ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కల్పించనున్నారు. అమర్‌నాథ్‌ యాత్రికుల బేస్‌ క్యాంప్‌కు రైల్వే స్టేషన్‌, ఎయిర్‌పోర్టు నుంచి చేరుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని అమిత్‌ షా అధికారులకు సూచించారు. అమర్‌నాథ్‌ యాత్రికులు అందరికీ భద్రత కల్పించాలని ఆదేశించారు.

సరిహద్దు ప్రాంతాల్లో భారీ భద్రత
మరోవైపు, పాకిస్థాన్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అడ్డుకునేందుకు భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ, కథువా, దోడా జిల్లాల్లో గతవారం ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. ఉగ్రదాడుల్లో 9 మంది యాత్రికులు, ఒక సీఆర్​పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు భద్రతా సిబ్బంది సహా అనేక మందికి గాయాలయ్యాయి. కథువా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఒకే ట్రాక్​పై మెట్రో, నమో భారత్​ రైలు- అత్యాధునిక ఫీచర్లతో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్- ఎక్కడో తెలుసా? - Meerut Metro Namo Bharat Station

సూపర్​ ఫీచర్లతో వందేభారత్ స్లీపర్​ రెడీ- త్వరలోనే పట్టాలపై పరుగులు! - Vande Bharat Sleeper Trains

ABOUT THE AUTHOR

...view details