Jammu Kashmir Elections 2024 Third Phase : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఇప్పటికే రెండు విడతల్లో 50 చోట్ల పోలింగ్ పూర్తవగా చివరి విడతలో మిగతా 40 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము ప్రాంతంలోని, జమ్ము, ఉద్ధంపుర్, సాంబ, కథువా, ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 415 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకొంటున్నారు. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బెయిగ్ కూడా ఉన్నారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికల తొలి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.31 శాతం పోలింగ్ నమోదైంది. మూడోవిడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్ లక్ష్యంగా కేంద్ రఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తుండడం సహా అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ప్రచారపర్వంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పాకిస్థాన్, ఆర్టికల్ 370, ఉగ్రవాదం, రాష్ట్ర హోదా, రిజర్వేషన్ల అంశాలపై ప్రచారం నిర్వహించాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అధ్యక్షుడు JP నడ్డా విస్త్రతంగా ప్రచారం చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాయని, ఉగ్రవాదులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటాయని పెద్దఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్త జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పెద్దఎత్తున ప్రచార సభలు నిర్వహించింది. జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.
అయితే మంగళవారం జరిగే మూడో దశ పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రెండు దశల్లో 50 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 17 స్థానాల్లో పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆఖరి దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరగనుందని తెలిపారు. అక్టోబర్ 8న చేపట్టే లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ప్రతి అభ్యర్థికి పోల్ అయిన ఓట్లను ప్రదర్శిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిబంధనలు అమల్లో ఉన్నాయన్నారు. కౌంటింగ్ విధానంపై జరుగుతోన్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు.