తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర ఎన్నికలకు ఆప్ దూరం- 'కేజ్రీవాల్​ను చంపేందుకు కుట్ర!' - MAHARASHTRA ASSEMBLY ELECTION 2024

మహారాష్ట్ర ఎన్నికల వేళ ఆప్​ కీలక నిర్ణయం- పోటీకి దూరం- వారికి సంపూర్ణ మద్దతు!

Maharashtra Assembly Election 2024
Maharashtra Assembly Election 2024 (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 9:45 PM IST

Updated : Oct 27, 2024, 6:21 AM IST

Maharashtra Assembly Election 2024 :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ తెలిపారు. కానీ, మహా వికాస్‌ అఘాఢీ కూటమిలోని పార్టీలకు మద్దతుగా తమ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.

మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్‌ ఎన్నికల విషయంలోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇదే నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ హేమంత్ సోరెన్‌కు మద్దతుగా ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీకి కేజ్రీవాల్‌ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మహరాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్‌ 20న పోలింగ్‌ జరనుండగా, ఝర్ఖండ్‌లో 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. కాగా, రెండు రాష్ట్రాల ఫలితాలు అదే నెల 23న వెలువడనున్నాయి.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పోటీగా విపక్ష పార్టీలన్నీ గతంలోనే ఇండియా కూటమిని స్థాపించాయి. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి సీట్లు షేర్ చేసుకుంది. ఒక్క పంజాబ్‌లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. ఇక ఇటీవల జరగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తాజాగా మహారాష్ట్ర, ఝర్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలిచింది.

ఓవర్​ కాన్ఫిడెన్స్​ పనికిరాదు : అరవింద్ కేజ్రీవాల్
అయితే, హరియాణా ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆప్​ మున్సిపల్​ కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎప్పడూ ఓవర్​ కాన్ఫిడెన్స్​ ప్రదర్శనించకూడదని, హరియాణా ఎలక్షన్స్​ ద్వారా గుణపాఠం నేర్చుకున్నట్లు తెలిపారు. ఏ ఎన్నికనూ తేలికగా తీసుకోకూడదన్న కేజ్రీవాల్​, ప్రతి సీటు చాలా కఠినమైనదని చెప్పారు.

మరోవైపు, కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ ఆరోపించారు. ఆయనకు ఎలాంటి హాని కలిగినా దానికి ఆ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం పశ్చిమ దిల్లీలోని వికాస్‌పురిలో కేజ్రీవాల్‌ పాదయాత్రపై బీజేపీ గూండాలు దాడి చేశారని, పోలీసులు చూసీచూడనట్లు వదిలేయడం వల్లనే అది జరిగిందని చెప్పారు. కుట్రకోణాన్ని అది బలపరుస్తోందని, కేజ్రీవాల్‌ జీవితానికి భాజపా ఒక శత్రువులా మారిందని అన్నారు. దాడితో యాత్ర ఆగేది లేదని, ముందు నిర్ణయించిన ప్రకారం అది కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ యువమోర్చా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని దిల్లీ క్యాబినెట్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు.

Last Updated : Oct 27, 2024, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details