456 Candidates In Belagavi LS Polls 1996 :సాధారణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 50మంది లేదంటే అంతకు మించి అభ్యర్థులు పోటీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ నియోజకవర్గం నుంచి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో 301 మంది, 1996లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో 456 మంది అభ్యర్థులు పోటీ చేసి రికార్డు సృష్టించారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఈ రెండు ముఖ్యమైన ఎన్నికలు అప్పట్లో దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాయి. ఒకేసారి ఇంతమంది పోటీ చేసే సరికి డిపాజిట్లు కూడా భారీగానే పెరిగాయి. అయితే 1985, 1996లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవడం ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారింది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈసీ, భారీ ఎత్తున అభ్యర్థులు పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి చరిత్ర సృష్టించింది.
301 మంది అభ్యర్థులు బరిలో!
అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) నకిలీ ఓటింగ్ ద్వారా విజయం సాధిస్తూ వస్తుందన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. దీంతో కన్నడకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల 1985లో జరిగిన బెళగావి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నాయకులు ప్రత్యేక పోరాటానికి ప్రణాళికలు రచించి ఏకంగా 301 మంది అభ్యర్థులను బరిలోకి దింపారు. ఆ సమయంలో కన్నడ అనుకూల నాయకులు, వారి కుటుంబ సభ్యులు, పలు పత్రికలకు చెందిన ఎడిటర్లు, జర్నలిస్టులు ఎన్నికల బరిలోకి దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల గుర్తుల పంపిణీ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఎన్నికల కమిషన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అసంబద్ధమైన అసెంబ్లీ ఎన్నికలు అప్పట్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. కాగా, ఎట్టకేలకు నిర్వహించిన ఎన్నికల్లో చివరకు ఎంఈఎస్ బలపరిచిన అభ్యర్థి ఆర్.ఎస్ మానే గెలిచి రికార్డు సృష్టించాడు.
బెడిసికొట్టిన ఎంఈఎస్ ప్లాన్!
1985లో కన్నడిగులు అమలు చేసిన ఈ ప్లాన్‌ను ఎంఈఎస్ 1996 లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 456 మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నిక కూడా ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. అధిక సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసి ఎన్నికలు నిర్వహించడం ఈసీకి సవాలుగా నిలిచింది. ఇందుకోసం ఎన్నికలను రెండు నెలలపాటు వాయిదా వేశారు. జనతాదళ్ నుంచి శివానంద కౌజలగి, బీజేపీ నుంచి బాబా గౌడ పాటిల్, కాంగ్రెస్ నుంచి ప్రభాకర్ కోరె పోటీ చేశారు.
452మంది ఎంఈఎస్ అభ్యర్థులు
కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్, కేసీపీ పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా, మిగతా 452 మంది అభ్యర్థులు ఎంఈఎస్ నుంచి రంగంలోకి దిగారు. అయితే ఎంఈఎస్ అభ్యర్థి ఎవరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఈ ఎన్నికల సమరంలో జనతాదళ్‌కు చెందిన అభ్యర్థి శివానంద కౌజలగిని విజయం వరించింది.